బియ్యం కార్డులు మంజూరెన్నడో!?

ABN , First Publish Date - 2022-12-10T01:09:13+05:30 IST

ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో అర్హులైన వ్యక్తులకు బియ్యం కార్డులు మంజూరుచేస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది.

బియ్యం కార్డులు మంజూరెన్నడో!?

ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో కొత్త కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన

పదో తేదీ వచ్చినా ఆ ఊసే ఎత్తని అధికారులు

జూన్‌ నుంచి డిసెంబరు వరకూ ఆరు వేలకు పైగా కార్డులు తగ్గుదల

విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో అర్హులైన వ్యక్తులకు బియ్యం కార్డులు మంజూరుచేస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఈ నెలలో ఇప్పటివరకూ కొత్త కార్డుల ఊసేలేదు.

బియ్యం కార్డు కోసం అర్హులైనవారు గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అక్కడ నుంచి దరఖాస్తు అప్‌లోడ్‌ చేస్తే అర్హత మేరకు ప్రభుత్వం కొత్త కార్డులను మంజూరుచేస్తోంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో 5.18 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. గడచిన ఐదు నెలల నుంచి దరఖాస్తు చేసుకున్న సుమారు 1,500 మందికి ఈ నెలలో కొత్తగా కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు సరికదా పౌర సరఫరాల అధికారులు కూడా నోరు మెదపడం లేదు.

ఇదిలావుండగా బియ్యం కార్డు ఉన్నవారు కూడా రకరకాల కారణాలతో వాటిని కోల్పోతున్నారు. ఆదాయ పన్ను చెల్లింపునకు రిటర్న్స్‌ దాఖలు చేసినవారు, నగరంలో 1000 చ.అ. విస్తీర్ణంలో సొంత ఇల్లు, నాలుగు చక్రాల వాహనం, ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగివుంటే కార్డు రద్దు చేస్తున్నారు. అలాగే బతుకుతెరువు కోసం చిన్నదుకాణం ఏర్పాటుకోసమో లేదా ట్యాక్సీ నడుపుకునేందుకు రుణం కోసం బ్యాంకుకు వెళితే ఇన్‌కంట్యాక్స్‌ రిటర్న్స్‌ గురించి అడుగుతారు. ఆ తరువాత రుణం మంజూరైనా, కాకపోయినా అప్పటికే వున్న బియ్యం కార్డు మాత్రం రద్దయిపోతోంది. ఈ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి సోమవారం జరిగే స్పందనకు కనీసం 20 నుంచి 30 మంది వరకూ వస్తుంటారు. ఆదాయంతో సంబంధం లేకుండా రిటర్న్స్‌ దాఖలు చేసిన వ్యక్తుల ఇబ్బందులను పరిష్కరించాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో స్పందనలో ఫిర్యాదు చేస్తున్నా వారి సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. అయినా కొందరు లబ్ధిదారులు నెలకు ఒకసారైనా స్పందనకు వచ్చి తమ గోడు చెప్పుకుంటారు. అధికారుల లెక్కల ప్రకారం 2017 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్‌కు సంబంధించి సమస్య పరిష్కరించలేదు. అప్పటి నుంచి రిటర్న్స్‌ దాఖలు చేసిన వ్యక్తుల కార్డులు రద్దు కావడం తప్ప పునరుద్ధరణ లేదు. కాగా జిల్లాలో పలు కారణాలతో ఈ ఏడాది జూన్‌ నుంచి డిసెంబరు వరకు ఆరు వేల బియ్యం కార్డులు తగ్గాయి. ఈ ఏడాది జూన్‌లో 5,24,195 బియ్యం కార్డులు ఉండగా...డిసెంబరు నాటికి 5,18,917కి తగ్గాయి. చనిపోయిన, అనర్హత కారణంగా కార్డులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ఏడాది జూన్‌ నుంచి డిసెంబరు వరకు 784 కార్డులు మంజూరుకాగా, 739 కార్డులు విభజించారని జిల్లా పౌర సరఫరాల అధికారి జి. సూర్యప్రకాష్‌ తెలిపారు. త్వరలో వీరికి కార్డులు అందజేస్తామన్నారు.

Updated Date - 2022-12-10T01:09:14+05:30 IST