అరకులోయను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2022-02-19T05:57:34+05:30 IST

అరకులోయను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మర్రికామయ్య అరకు జిల్లా సాధన సమితి బృందం డిమాండ్‌ చేసింది.

అరకులోయను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
ర్యాలీ నిర్వహిస్తున్న అరకు జిల్లా సాధన సమితి ప్రతినిధులు


అరకు జిల్లా సాధన సమితి డిమాండ్‌

అరకులోయ, ఫిబ్రవరి 18: అరకులోయను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మర్రికామయ్య అరకు జిల్లా సాధన సమితి బృందం డిమాండ్‌ చేసింది. శుక్రవారం జిల్లా సాధన సమితి పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో టీడీపీ, వైసీపీ, జనసేన, వైసీపీ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు, పలు సంఘాల నాయకులు వేంకటేశ్వర కల్యాణ మండపం నుంచి తహసీల్దార్‌ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరకును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, వైద్య కళాశాల, గిరిజన విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు దొన్నుదొర, బీజేపీ అరకు జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు మాట్లాడుతూ.. ర్యాలీకి వస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు రాకుండా పోలీసులు అడ్డుకు న్నారని ఆరోపించారు. పోరాటాన్ని  అణగదొక్కే ప్రయత్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌ కాలంలో ఈ పోరాటానికి ఎమ్మెల్యే, ఎంపీ మద్దతు పలికి, ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అరకు జిల్లా సాధన సమితి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ బీబీ నాగేశ్వరరావు, పెట్టెలి దాసుబాబు, బూర్జ లక్ష్మి, జనసేన నేత శ్రీరాములు,  వైసీపీ ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు కిమిడి అశోక్‌, ఎంపీటీసీ సభ్యుడు దురియా ఆనంద్‌, జేఏసీ ప్రతినిధులు జాన్‌మోహన్‌, ఆనంద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-19T05:57:34+05:30 IST