వసతిగృహాల్లో అరకొర మెనూ!

ABN , First Publish Date - 2022-09-13T06:18:31+05:30 IST

సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందడంలేదు. మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచడంలేదు.

వసతిగృహాల్లో అరకొర మెనూ!
కశింకోటలోని సమీకృత బాలికల వసతిగృహంలో భోజనాలు చేస్తున్న విద్యార్థినులు

మూడేళ్ల నుంచి డైట్‌ చార్జీలు పెంచని ప్రభుత్వం

పెరిగిపోతున్న నిత్యావసర సరకులు ధరలు

సంక్షేమ హాస్టళ్లలో మెనూకు తిలోదకాల

బడుగు విద్యార్థులకు అందని పౌష్టికాహారం


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందడంలేదు. మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచడంలేదు. దీంతో వసతిగృహాల నిర్వాహకులు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు, అల్పాహారం పెట్టడంలేదు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం సవరించిన మెస్‌ చార్జీలే ఇప్పటికీ అమలవుతున్నాయి. అప్పటితో పోలిస్తే అన్ని రకాల సరకుల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయని వసతిగృహాల వార్డెన్లు చెబుతున్నారు. 

జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 31, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వరంలో 53, మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో నాలుగు కలిపి.. మొత్తం 87 వసతిగృహాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు వుంటున్నారు. వసతిగృహాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,250, ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు నెలకు రూ.1,400 చొప్పున ప్రభుత్వం డైట్‌ చార్జీల కింద చెల్లిస్తున్నది. 2018లో టీడీపీ అధికారంలో వున్నప్పుడు డైట్‌ చార్జీలను పెంచారు. మరుసటి ఏడాది వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు డైట్‌ చార్జీలను పెంచలేదు. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో సంక్షేమ వసతిగృహాల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు వండి పెట్టడం నిర్వాహకులకు సవాల్‌గా మారింది. నాలుగేళ్ల క్రితం వున్న ధరలతో పోలిస్తే అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. 2018లో కందిపప్పు కిలో రూ.75, వంట నూనె లీటరు రూ.90, పాలు లీటరు  రూ.50, చికెన్‌ రూ.150 వుండగా, ఇప్పుడు కందిపప్పు కిలో రూ.120, వంట నూనె కిలో రూ.160, పాలు లీటరు రూ.65, చికెన్‌ రూ.250 వున్నాయి. ఇంకా చింతపండు, కూరగాయలు, ఇతర సరకులు, వంటగ్యాస్‌ ధరలు సైతం ఇదే తరహాలో పెరిగాయి. కానీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల డైట్‌ చార్జీలను ప్రభుత్వం పెంచలేదు. దీంతో మెనూ ప్రకారం అల్పాహారం, భోజనాలు పెట్టలేకపోతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. డైట్‌ చార్జీలు పెంచాలని ఆయా సంక్షేమ శాఖల అదికారులు ప్రభుత్వానికి తరచూ విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడంలేదు. కాగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా డైట్‌ చార్జీలు పెంచకపోవడంతో కొన్ని హాస్టళ్లలో వార్డెన్లు మెనూ అమలుకు తిలోదకాలు ఇస్తున్నారు. కిలో కందిపప్పు బదులు అర కిలోతో సరిపెడుతున్నారు. ప్రభుత్వం డైట్‌ చార్జీలు పెంచకపోవడంతో వసతిగృహాల్లో మెనూ సక్రమంగా అమలు జరగకపోయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

నాడు-నేడు కార్యక్రమం పేరులో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... సంక్షేమ వసతిగృహాల్లో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టకపోవడంతో శోచనీయమని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Read more