మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు

ABN , First Publish Date - 2022-09-13T06:23:12+05:30 IST

ఏజెన్సీలో రానున్న ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు
అధికారులతో సమావేశమైన ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

అధికారులకు ఐటీడీఏ పీవో ఆదేశం 


పాడేరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో రానున్న ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. ఏజెన్సీలో ఉద్యానవన అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో సోమవారం తన కార్యాలయంలో కాఫీ తోటల విస్తరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఏజెన్సీ పదకొండు మండలాల్లో 2 లక్షల 23 ఎకరాల్లో కాఫీ తోటలున్నాయన్నారు. ఆయా తోటల్లో 71 వేల టన్నుల కాఫీ పళ్లు దిగుబడి వస్తుందని భావిస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది 15 వేల టన్నుల కాఫీ పల్పింగ్‌ లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. ఏజెన్సీలోని కాఫీ రైతులందర్నీ మ్యాక్స్‌ సొసైటీలో సభ్యులుగా చేర్చాలని ఐటీడీఏ పీవో సూచించారు. అలాగే జి.మాడుగుల, జీకే.వీధిలో ఎకో పల్పింగ్‌ యూనిట్లను ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కాఫీ రైతులకు గిట్టుబాటు ధర లభించిందన్నారు. కాఫీ పళ్లను సేకరించి ఎకో పల్పింగ్‌ యూనిట్‌కు చేర్చాల్సిన బాధ్యత కాఫీ క్షేత్రస్థాయి సిబ్బందిపైనే ఉందన్నారు. ప్రతి మండల కేంద్రంలో కాఫీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని వెల్లడించారు. కాఫీ సాగులో మెళకువలు, అధిక దిగుబడులు సాధించే విధంగా యాజమాన్య పద్ధతులపై కాఫీ రైతులకు ఐటీడీఏ, మ్యాక్స్‌ సొసైటీల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. కాఫీ రైతులందరికీ యూనియన్‌ బ్యాంకులో ఖాతాలు తెరవాలని, వారికి బ్యాంకు రుణాలు అందిస్తామని చెప్పారు. కాఫీ విభాగం అధికారులు రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఏజెన్సీ మండలాల ఉద్యాన, వ్యవసాయ, కాఫీ విభాగం అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-13T06:23:12+05:30 IST