మరో 130

ABN , First Publish Date - 2022-12-12T01:26:11+05:30 IST

ప్రతిష్ఠాత్మక ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) వైద్య నిపుణుల సీట్లు భారీగా పెరగనున్నాయి.

మరో 130

ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో భారీగా పెరగనున్న పీజీ సీట్లు

అధికారుల ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

మౌలిక వసతులు, పరికరాల కొనుగోలుకు రూ.150 కోట్లు

కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తి చొప్పున నిధులు కేటాయింపు

త్వరలో ఎన్‌ఎంసీ బృందం పరిశీలన

ప్రస్తుతం వివిధ విభాగాల్లో 252 సీట్లు

గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే 382కి పెరగనున్న సీట్లు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

ప్రతిష్ఠాత్మక ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) వైద్య నిపుణుల సీట్లు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ఏఎంసీ అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం మెడికల్‌ కళాశాలలో 25 విభాగాలకు సంబంధించి 252 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 130 సీట్లు మంజూరు చేయాలని కోరుతూ పంపిన ప్రతిపాదనపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. పెరగనున్న సీట్ల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు సుమారు రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఏఎంసీ అధికారులకు సమాచారం అందింది.

ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కళాశాలకు అనుబంధంగా ఉన్న కేజీహెచ్‌కు ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వైద్య సేవలు పొందడానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. వీరికి వైద్య సేవలు అందించడంతో వైద్య నిపుణులతోపాటు పీజీ విద్యార్థులది ప్రధాన పాత్ర అని చెప్పక తప్పదు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి 252 పీజీ సీట్లు వున్నాయి. కేజీహెచ్‌కు వచ్చే రోగులు నానాటికీ పెరుగుతుండడంతో ఈ మేరకు పీజీ సీట్లను మరో 130 పెంచాలని ఆంధ్ర మెడికల్‌ కళాశాల అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపారు. దీనికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా నిధులు కూడా విడుదల చేయనుంది. మొత్తం రూ.150 కోట్లలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.90 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.60 కోట్లు ఏఎంసీకి సమకూరుస్తాయి. ఈ నిధులతో ఏఎంసీలో రెండు వసతిగృహాలను నిర్మించనున్నారు. జీ ప్లస్‌ ఎనిమిది అంతస్థులతో ఒకటి, జీ ప్లస్‌ ఏడు అంతస్థులతో మరొకదానిని నిర్మిస్తారు. ఇందుకోసం రూ.75 కోట్లు వెచ్చించనున్నారు. ఒక వసతిగృహాన్ని ప్రస్తుతం బాయ్స్‌ హాస్టల్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, మరొకదానిని చిన్నపిల్లల వార్డు దాటిన తరువాత లైబ్రరీ ఎదురుగా ఉన్న స్థలంలో నిర్మిస్తారు. మిగిలిన రూ.75 కోట్లతో సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌, ఆల్ర్టాసౌండ్‌, కేన్సర్‌ నిర్ధారణకు సంబంధించిన పలు ముఖ్యమైన పరికరాలు, త్రెడ్‌మిల్‌, కలర్‌ డాప్లర్‌, 2డీ ఎకో వంటి యంత్రాలతోపాటు ఆయా పీజీ విభాగాలకు సంబంధించి రోగ నిర్ధారణకు వినియోగించే అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నారు.

త్వరలో ఎన్‌ఎంసీ బృందం రాక

ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పీజీ సీట్ల పెంపునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వసతులను పరిశీలించేందుకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) బృందం త్వరలో విశాఖ రానున్నది. సీట్ల పెంపునకు సంబంధించి ఈ బృందం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం అత్యంత కీలకం. కాగా పీజీ సీట్లు పెరిగితే మరింత వైద్య నిపుణులు అందుబాటులోకి రావడంతోపాటు రోగులకు వేగవంతంగా, మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2022-12-12T01:26:13+05:30 IST