వరహా నదిలో జారిపడి వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-07-05T06:36:26+05:30 IST

వరహా నదిలో ప్రమాదవశాత్తు ఓ వృద్ధుడు జారిపడి మృతిచెందాడు.

వరహా నదిలో జారిపడి వృద్ధుడి మృతి
అన్నం నాయుడు (ఫైల్‌ ఫొటో)


పశువులను శుభ్రం చేస్తుండగా ఘటన


ఎస్‌.రాయవరం, జూలై 4: వరహా నదిలో ప్రమాదవశాత్తు  ఓ వృద్ధుడు జారిపడి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలివి. మండలంలోని  ధర్మవరం అగ్రహారం గ్రామానికి చెందిన అన్నం నాయుడు  (61) తన పొలానికి ఎదురుగా ఉన్న వరహా నదిలోకి సోమవారం ఉదయం పశువులను శుభ్రపర్చేందుకు తీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలు జారడంతో నదిలో మునిగిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని వెనువెంటనే పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక, రెస్క్యూ బృందం సభ్యులతో పాటు గజ ఈతగాళ్లను తెప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అన్నంనాయుడు మృతదేహాన్ని వీరు కనుగొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.


పాముకాటుతో మహిళా రైతు మృతి

చీడికాడ, జూలై 4: మండలంలో వెల్లంకి గ్రామానికి చెందిన రొంగలి వరలక్ష్మి(59) పాముకాటుతో మృతి చెందిందని ఎస్‌ఐ కె.సుధాకర్‌రావు తెలిపారు. వరలక్ష్మి ఆదివారం మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా..  పాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది. భర్త అచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

  

తుమ్మపాలలో మరొకరు...

కొత్తూరు, జూలై 4 : పాముకాటుకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన సోమవారం తుమ్మపాలలో చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మపాల పంచాయతీ గవరపేట వీధికి చెందిన దాడి వెంకటఅప్పారావు (38) దిబ్బపాలెంలో పొలంలోని తన పొలంలో పనులు చేయించేందుకు ఉదయం వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత అతని నోటి నుంచి నురగలు వస్తున్న విషయాన్ని సమీప రైతులు గుర్తించి తండ్రి సూర్యారావుకు సమాచారం అందించారు. వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 


ఇంటి పత్రాలు ఇవ్వలేదని తండ్రిపై హత్యాయత్నం 

అనకాపల్లి టౌన్‌, జూలై 4 : ఇంటి ఆస్తి పత్రాలు ఇవ్వడానికి నిరాకరించిన తండ్రిపై ఓ కొడుకు సోమవారం సాయంత్రం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పట్టణ ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ తెలిపిన వివరాలివి. విజయరామరాజుపేటలోని శ్రీరామనగర్‌ కాలనీకి చెందిన ఉలంపర్తి నాగరాజు కొత్తూరు జంక్షన్‌లో చికెన్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఇతడి కుమారుడు ప్రసాద్‌ ఓ ఆలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు.  సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న తండ్రి వద్దకు ప్రసాద్‌ వచ్చి తనఖాలో పెట్టిన ఇంటిపత్రాలు ఇవ్వాలని అడిగాడు. కొడుకు స్థిరంగా లేకపోవడంతో ఇందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో అక్కడున్న మంచం కోడుతో నాగరాజు తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు.  వెంటనే అతనిని ఎన్టీఆర్‌ వైద్యాలయానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.  


22 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు

కొయ్యూరు, జూలై 4: మండలంలోని బూదరాళ్ల గ్రామ శివారులో గంజాయితో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారని మంప ఎస్‌ఐ లోకేశ్‌ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు చేపడుతుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తుల వద్ద గంజాయి లభ్యమైందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని  సర్పవరం గ్రామానికి చెందిన రొట్లా జయకుమార్‌, సురకాసుల రాజేశ్‌కుమార్‌ చింతపల్లి మండలం రాజుపాకలు నుంచి  గంజాయి కొనుగోలు మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. 22 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ వివరించారు.


12 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్టు 

కశింకోట, జూలై 4 : గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ దీనబంధు తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం ఆయన తెలిపిన వివరాలివి. అనకాపల్లి సమీపం కొత్తూరు ప్రాంతానికి చెందిన షేక్‌ మాన్‌సూర్‌, పెదపూడి చినఅప్పన్న, తమిళనాడుకు చెందిన మురుగన్‌ పెరియాసామీలు ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై ఆరు గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్నారన్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది వీరిని తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి బయటపడినట్టు చెప్పారు.   దీంతో నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.


Read more