సర్కారుతో అమీతుమీ!

ABN , First Publish Date - 2022-11-19T03:21:08+05:30 IST

పంచాయతీ నిధులు దారిమళ్లించిన వైసీపీ ప్రభుత్వంతో రాజకీయాలకతీతంగా అమీతుమీ తేల్చుకోవాలని సర్పంచ్‌లు నిర్ణయించారు.

సర్కారుతో అమీతుమీ!

పంచాయతీల నిధులు రాబట్టే వరకు ఉద్యమం

పార్టీలకతీతంగా సర్పంచ్‌ల సమరశంఖం

అమరావతి, విజయవాడ(గవర్నర్‌పేట), నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ నిధులు దారిమళ్లించిన వైసీపీ ప్రభుత్వంతో రాజకీయాలకతీతంగా అమీతుమీ తేల్చుకోవాలని సర్పంచ్‌లు నిర్ణయించారు. విద్యుత్‌ బిల్లుల బకాయిల రికవరీ పేరుతో గ్రామ సర్పంచ్‌లకు చెందిన పీఎ్‌ఫఎంఎస్‌ ఖాతాలను నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.8660 కోట్లను దొంగిలించిందని, ఆ నిధులు ఏమయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. రెండు రోజుల పాటు జరిగే ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌, ఏపీ సర్పంచ్‌ల సంఘాల రాష్ట్ర కమిటీల సమావేశాలు శుక్రవారం విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో ప్రారంభమయ్యాయి. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, విద్యుత్‌ బకాయిలు రికవరీ చేశామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. 1984 నుంచి పంచాయతీలకు అసలు విద్యుత్‌ చార్జీలు లేవని, ఈ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలు రికవరీ చేశామని చెప్పడం మోసంతో కూడుకున్నదని తెలిపారు. కరెంటు బిల్లు కోసం చెల్లించి ఉంటే పంచాయతీలకు రశీదులు ఎందుకు ఇవ్వలేదని వైవీబీ ప్రశ్నించారు. విద్యుత్‌ బిల్లుల బకాయిల రికవరీ అన్నది పచ్చి బూటకమని, ఆ పేరుతో పంచాయతీల నిధులు దారిమళ్లించి ముఖ్యమంత్రి సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. అసలు గ్రామ పంచాయతీల నిధులు సర్పంచ్‌ సంతకం లేకుండా ఎలా డ్రా చేస్తారని నిలదీశారు. పంచాయతీలకు రావాల్సిన రూ. 2000 కోట్ల గ్రాంట్లు కూడా నిలిపివేశారని ఆరోపించారు. సర్పంచ్‌లెవరూ కరెంటు బిల్లులు చెల్లించవద్దని, రాజకీయాలకతీతంగా ప్రభుత్వంతో ఆమీతుమీ తేల్చుకుందామని పిలుపునిచ్చారు.

వలంటీర్ల కంటే తీసిపోయామా?

గ్రామాల్లో వలంటీర్లకిచ్చిన విలువ కూడా సర్పంచ్‌లకు లేకపోవడం దారుణమని వైవీబీ ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు నెలకు రూ.5 వేలు గౌరవవేతనం ఇస్తూ సర్పంచ్‌లకు రూ.3వేలు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన రూ.8660 కోట్ల గ్రామ పంచాయతీ నిధుల సమస్య, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలపై సమావేశంలో చర్చించారు. వీటి పరిష్కారం కోసం పార్టీలకతీతంగా సర్పంచ్‌ల సమర శంఖారావం పేరుతో పోరాట కార్యాచరణ రూపొందించాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిర్రు ప్రతా్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ సర్పంచ్‌ ఆవేదన

ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సర్పంచ్‌ రావెళ్ల సుధాకర్‌ మాట్లాడుతూ వైఎస్‌, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మైనర్‌ పంచాయతీలకు విద్యుత్‌ బిల్లులు మాఫీ చేశారని, జగన్‌ వచ్చిన తర్వాత అన్ని పంచాయతీలకు విద్యుత్‌ చార్జీలు వడ్డించారన్నారు. ఒక చాన్స్‌ అని అడిగితే అందరం మద్దతిచ్చి జగన్‌ను గెలిపించామని, ఆయన రాకతో పంచాయతీలకు మనుగడ లేకుండా పోయిందన్నారు. కడప జిల్లాకు చెందిన బీజేపీ సర్పంచ్‌ కొండయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో సర్పంచ్‌ల సమస్యలకు పరిష్కారం చూపే పార్టీలకే మద్దతిస్తామన్నారు.

Updated Date - 2022-11-19T03:21:08+05:30 IST

Read more