అల్లూరి స్మారక ప్రదేశాలు పర్యాటకంగా అభివృద్ధి

ABN , First Publish Date - 2022-07-05T06:37:39+05:30 IST

మన్యం విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పిడిక రాజన్నదొర అన్నారు.

అల్లూరి స్మారక ప్రదేశాలు పర్యాటకంగా అభివృద్ధి
కృష్ణాదేవిపేట పార్కులో అల్లూరి, గంటందొరల సమాధులపై పుష్పగుచ్ఛాలను ఉంచుతున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర, అనకాపల్లి కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణమహనీయుని జీవిత చరిత్ర అందరికీ తెలిసేలా తీర్చిదిద్దుతాం

రూ.66 లక్షలతో పార్కు అభివృద్ధి.. రెండు నెలల్లో పనులు ప్రారంభం

ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర

కృష్ణాదేవిపేటలో అల్లూరి, గంటందొరలకు ఘననివాళులు


కృష్ణాదేవిపేట, జూలై 4: మన్యం విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పిడిక రాజన్నదొర అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని స్మారక పార్కులో అల్లూరి, గంటందొర సమాధులపైన, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి జీవిత చరిత్ర అందరికీ తెలిసేలా ఆయా ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతామన్నారు. ఇక్కడ పార్కు అభివృద్ధికి రూ.66 లక్షలు మంజూరు చేశామని, రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అల్లూరి స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్కులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులను అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. వారికి ఒక నెల జీతంగా రూ.5 వేల చొప్పున రూ.15 వేలు అందజేశారు. గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు (ఐదు) రూ.50 వేల చొప్పున నగదు అందజేసి, శాలువాలతో సత్కరించారు. 

 జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ, నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలు, అభివృద్ధి అల్లూరి వంటి మహానుభావుల చలవేనని అన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ, చింతపల్లి మండలం తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మితమవుతుందని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో రోణంకి గోవిందరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రవీంద్రబాబు, స్థానిక సర్పంచ్‌ లోచల సుజాత, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, తహసీల్దార్లు వెంకటేశ్వరావు, అంబేడ్కర్‌, ‘నేను సైతం’ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు కుశిరెడ్డి శివప్రసాద్‌, యువజన సంఘం నాయకులు శ్యామల, వరలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.Read more