అల్లూరి జీవితం స్ఫూర్తిదాయక

ABN , First Publish Date - 2022-07-05T07:09:25+05:30 IST

ఏజెన్సీ గిరిజనుల్లో పౌరుషాగ్ని రగిలించి వారికి నాయకత్వం వహిస్తూ బ్రిటీష్‌ పాలకులపై తిరుగుబావుటా ఎగురవేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు.

అల్లూరి జీవితం స్ఫూర్తిదాయక
అల్లూరి జయంతి సభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మల్లికార్జున

జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున

పద్మనాభం (విశాఖపట్నం), జూలై 4: ఏజెన్సీ గిరిజనుల్లో పౌరుషాగ్ని రగిలించి వారికి నాయకత్వం వహిస్తూ బ్రిటీష్‌ పాలకులపై తిరుగుబావుటా ఎగురవేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం  నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు. అల్లూరి జన్మస్థలమైన పాండ్రంగిలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా సోమవారం నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  తొలుత అతిథులంతా అల్లూరి పార్క్‌లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే అల్లూరి జనన గృహంలోని సీతారామరాజు, ఆయన తల్లి సూర్యనారాయణమ్మల విగ్రహాల వద్ద అంజలి ఘటించారు. 


అనంతరం జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ 27 ఏళ్ల వయసులోనే బ్రిటీష్‌ మూకల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినా ఇప్పటికీ అల్లూరి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులన్నారు. పాండ్రంగిలో నిర్మిస్తున్న మ్యూజియం, వంతెన పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. స్థానిక సర్పంచ్‌ ఝాన్సీ తమ దృష్టికి తెచ్చిన సమస్యలు పరిశీలిస్తామన్నారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అల్లూరి జన్మస్థలం ఉండడం గర్వంగా ఉందన్నారు.


అల్లూరిని నిత్యం స్పరించుకునే విధంగా తమ ప్రభుత్వం ఓ జిల్లాకు ఆయన పేరుపెట్టిందని, అల్లూరి జీవిత విశేషాలు భావితరాలకు తెలిపేందుకు పాడేరు జిల్లాలో మ్యూజియం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇంకా సమావేశంలో వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ అల్లూరి ఘనతను కీర్తించారు. కాగా పాండ్రంగి పంచాయతీకి చెందిన ఆర్‌.ఎస్‌.సత్యనారాయణరాజు (కుర్రపల్లిబాబు) ‘ఒక్కడే వీరుడు అల్లూరి సీతారామరాజు’ పోస్టర్‌ను, పాటను కలెక్టర్‌ ఆవిష్కరించారు.


విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.రాంబాబు, జడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.గిరిబాబు పాల్గొన్నారు. కాగా, అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించిన వేదికపైనే అమ్మఒడి ప్రయోజనాల పంపిణీని చేపట్టారు. అలాగే పాండ్రంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించనున్న అదనపు భవనానికి అతిథులంతా శంకుస్థాపన చేశారు. 


Updated Date - 2022-07-05T07:09:25+05:30 IST