మళ్లీ పులి కలకలం

ABN , First Publish Date - 2022-07-18T06:20:54+05:30 IST

రెండు రోజుల నుంచి అలికిడి లేని పెద్దపులి.. ఆదివారం తెల్లవారుజామున మండలంలోని చింతపాలెం సమీపంలో ఒక ఎద్దుపై పంజా విసిరి కలకలం రేపింది.

మళ్లీ పులి కలకలం
పెద్దపులి దాడిలో చనిపోయిన ఎద్దు

చింతపాలెం సమీపంలో ఎద్దుపై పంజా

సమీపంలోని పొలాల్లోకి ఈడ్చుకెళ్లి హతం


కె.కోటపాడు, జూలై 17: రెండు రోజుల నుంచి అలికిడి లేని పెద్దపులి.. ఆదివారం తెల్లవారుజామున మండలంలోని చింతపాలెం సమీపంలో ఒక ఎద్దుపై పంజా విసిరి కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు  ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. పలుచోట్ల పులి పాదముద్రలను గుర్తించారు. పెద్దపులి గత మూడు రోజుల నుంచి నల్లగొండ, ఉలవలకొండ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు ఒక అంచనాకు వచ్చారు. పులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

జిల్లాలో సుమారు మూడు వారాలుగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి నాలుగు రోజు క్రితం సబ్బవరం, చోడవరం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి కె.కోటపాడు మండలంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆర్లి, చింతపాలెం గ్రామాల్లోని పొలాల్లో పలుచోట్ల పులి పాదముద్రలు కనిపించడంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. అయితే ఎక్కడా పశువులను, మేకలను చంపినట్టు సమాచారం లేకపోవడంతో ఒకింత ఊరట చెందారు. అయినప్పటికీ రెండు మూడు రోజుల వరకు లేదా పులి మరో ప్రదేశానికి తరలివెళ్లే వరకు ఆర్లి, చింతపాలెం, చంద్రయ్యపేట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు పులి సంచరించినట్టు ఎక్కడా సమాచారం లేకపోవడంతో ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చి వుంటుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆదివారం తెల్లవారుజామున చింతపాలెం సమీపంలోని మామిడితోట వద్ద ఒక పశువుల పాక బయట ఎద్దుపై దాడి చేసి చంపేసింది. అనంతరం సమీపంలోని పొలాల్లోకి ఈడ్చుకుపోయి కొంతమేర తినేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్‌ డీఎఫ్‌వో ధర్మ రక్షిత్‌ మాట్లాడుతూ, నల్లగొండ, ఉలవలకొండ ప్రాంతాల్లో పులి మకాం వేసినట్టు భావిస్తున్నామని చెప్పారు. దీనిని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట రేంజ్‌ ఆఫీసర్‌ రామ్‌నరేష్‌ బిర్లంగి, సెక్షన్‌ ఆఫీసర్‌ వి.రామారావు, బీట్‌ ఆఫీసర్‌ వసంత, సిబ్బంది కల్యాణి, యాదగిరి, చిన్నారావు, స్పెషల్‌ టీం సభ్యుడు అమర్‌నాఽథ్‌ వున్నారు. 

Read more