మళ్లీ ముసురు

ABN , First Publish Date - 2022-10-14T06:24:54+05:30 IST

రెండు రోజులు కాస్త తెరిపించిన ముసురు మళ్లీ గురువారం పలకరించింది. ఒడిశాలోని పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం మన్యంలో ముసురు వాతావరణం నెలకొంది.

మళ్లీ ముసురు
ముంచంగిపుట్టులో వర్షం పడుతున్న దృశ్యం

- ఒడిశాకు సరిహద్దులో భారీ వర్షాలు 

పాడేరు, అక్టోబరు 13(ఆంఽధ్రజ్యోతి): రెండు రోజులు కాస్త తెరిపించిన ముసురు మళ్లీ గురువారం పలకరించింది. ఒడిశాలోని పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం మన్యంలో ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల వరకు ఎండ కాయగా, తరువాత నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమైంది. పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి జల్లులతో కూడిన వర్షం పడగా, ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో వర్షం పడలేదు. 

ముంచంగిపుట్టులో..                             

ముంచంగిపుట్టు:  మండల పరిధిలో వర్షం కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం నుంచి  సాయంత్రం వరకు  భారీ వర్షం కురిసింది.  దీంతో  లక్ష్మీపురం, బూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు తదితర పంచాయతీల్లో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యగెడ్డ వరద నీటితో ఉరకలేస్తోంది. మత్స్యగెడ్డ ప్రవాహిత నీటిపై ఆధారపడి ఉన్న జోలాపుట్టు, డుడుమ జలాశయాలు వరదనీటితో నిండుకుండను తలపిస్తున్నాయి. గెడ్డ  పాయలు వరదనీటితో ప్రవహించడం, మట్టి రహదారులు బురదమయంగా మారడం వల్ల  పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

గూడెంకొత్తవీధిలో..

గూడెంకొత్తవీధి: మండలంలో భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు విడతల వారీగా కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం వల్ల జీకేవీధి వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.

లంబసింగిలో..

చింతపల్లి: మండలంలోని లంబసింగి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నాలుగు గంటల వరకు లంబసింగి, లోతుగెడ్డ జంక్షన్‌ మధ్య గ్రామాల్లో కుండపోత వర్షం కురిసింది. వర్షం వల్ల లంబసింగి వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు అవస్థలు పడ్డారు.

Read more