ఆరోగ్య శాఖపై ఏసీబీ కన్ను

ABN , First Publish Date - 2022-11-30T23:50:47+05:30 IST

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం సృష్టించింది. ఈ కార్యాలయ పరిధిలో కొన్నేళ్లుగా చేపట్టిన ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు వంటి అనేక వ్యవహారాల్లో ఉద్యోగులపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతో విచారణకు ఏసీబీని ఆదేశించింది. ఈ మేరకు సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సురేష్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు బుధవారం మధ్యాహ్నం ఆరోగ్య శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆరోగ్య శాఖాధికారి చాంబర్‌ వద్దకు వెళ్లారు. అయితే ఆమె సెలవులో వుండడంతో ఏవో సుమతి కార్యాలయానికి వెళ్లి ఛాంబర్‌లోని కీలక ఫైళ్లను సుమారు ఆరు గంటలపాటు పరిశీలించారు. ఏవోతో మాట్లాడి కీలక వివరాలను సేకరించారు. కార్యాలయం తలుపులు మూసి మరీ ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలించడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎవరిపై విచారణ సాగుతుందో తెలుసుకునేందుకు యత్నించారు.

ఆరోగ్య శాఖపై ఏసీబీ కన్ను
ఏవో కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

డీఎంహెచ్‌వో కార్యాలయంలో తనిఖీలు

అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

ఉద్యోగుల బదిలీలు, నియామకాలు, ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్ల వ్యవహారంలో 30 మంది అధికారులు/ఉద్యోగులపై ఆరోపణలు

తొలిరోజు ఏవో కార్యాలయంలో ఫైళ్ల పరిశీలన

నెల రోజులపాటు విచారణ సాగే అవకాశముందంటున్న ఏసీబీ అధికారులు

సిబ్బందిలో ఆందోళన

విశాఖపట్నం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం సృష్టించింది. ఈ కార్యాలయ పరిధిలో కొన్నేళ్లుగా చేపట్టిన ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు వంటి అనేక వ్యవహారాల్లో ఉద్యోగులపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతో విచారణకు ఏసీబీని ఆదేశించింది. ఈ మేరకు సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సురేష్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు బుధవారం మధ్యాహ్నం ఆరోగ్య శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆరోగ్య శాఖాధికారి చాంబర్‌ వద్దకు వెళ్లారు. అయితే ఆమె సెలవులో వుండడంతో ఏవో సుమతి కార్యాలయానికి వెళ్లి ఛాంబర్‌లోని కీలక ఫైళ్లను సుమారు ఆరు గంటలపాటు పరిశీలించారు. ఏవోతో మాట్లాడి కీలక వివరాలను సేకరించారు. కార్యాలయం తలుపులు మూసి మరీ ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలించడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎవరిపై విచారణ సాగుతుందో తెలుసుకునేందుకు యత్నించారు.

ఫిర్యాదుల నేపథ్యంలోనే...

కొన్నేళ్లుగా కార్యాలయంలోని పలు సెక్షన్లలో జరిగిన అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని, ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్టు సీఐ రామకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా వివిధ సెక్షన్లకు సంబంధించి సుమారు 30 మంది అధికారులు/ఉద్యోగులను విచారించనున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ఒకటి, రెండు రోజులతో ముగిసేది కాదని, సుమారు నెల రోజులు పడుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఫిర్యాదులకు సంబంధించి వివిధ సందర్భాల్లో వెలువడిన పత్రికల కథనాలను కూడా ఏసీబీ అధికారులు తీసుకువచ్చి, వాటిలో పేర్కొన్న అంశాలపై ఫైళ్లను పరిశీలిస్తున్నారు.

ఉద్యోగ నియామకాల్లో భారీ అక్రమాలు

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఎప్పుడు ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టినా..తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి. అభ్యర్థుల నుంచి పెద్దమొత్తంలో ముడుపులు తీసుకుని అడ్డగోలుగా ఉద్యోగావకాశాలు కల్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారు. వీటిపైనా గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. కొందరికి ఫేక్‌ నియామక ఉత్తర్వులు ఇచ్చిన వ్యవహారం అప్పట్లో దుమారం సృష్టించింది. ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నప్పటికీ, ఒక ఉద్యోగిని బలిచేసే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఈ వ్యవహారంపైనా ఏసీబీ దృష్టిసారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందంటున్నారు. ఇకపోతే నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు చేపట్టిన బదిలీల్లో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజుల కిందట ఆరోగ్య శాఖ పరిధిలో చేపట్టిన ఉమ్మడి నియామక ప్రక్రియలోను పెద్దమొత్తంలో నగదు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కలెక్టర్‌ జోక్యం చేసుకుని మరోసారి నియామక ప్రక్రియకు ఆదేశించారు. అయితే ఇందులోనూ కొన్ని ఉద్యోగాల్లో అనర్హులు చేరినట్టు చెబుతున్నారు.

క్లాత్‌ మిస్సింగ్‌పైనా విచారణ..

నాలుగో తరగతి ఉద్యోగులకు అందించే వైట్‌, ఖాకీ, బ్లౌజ్‌ క్లాత్‌, శారీస్‌ మాయంపై ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పుడే విచారణ జరిగింది. క్లాత్‌ మిస్సింగ్‌ వాస్తమేనని నివేదికలో నిర్ధారించినా, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. సుమారు మూడు వేల మీటర్లు క్లాత్‌ మిస్‌ అయినట్టు చెబుతున్నారు. దీనిపైనా విచారణ చేపడతామని ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో జరిగిన అక్రమాలపైనా దృష్టిసారించారు. ఉద్యోగులకు శిక్షణ పేరుతో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై అధికారులు దృష్టిసారించారు.

ఉద్యోగుల వివరాలు..ఫోన్‌ నంబర్లు..

ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు, వారి కేడర్‌, ఇక్కడ పని చేసినప్పుడు ఏయే హోదాల్లో పనిచేశారు, వారి ఫోన్‌ నంబర్లను ఏసీబీ అధికారులు సేకరించారు. విచారణలో భాగంగా వారిని ప్రశ్నించనున్నట్టు సమాచారం.

Updated Date - 2022-11-30T23:50:50+05:30 IST