ఆదివాసీలతోనే గెస్ట్‌ టీచర్‌ పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2022-09-11T06:24:52+05:30 IST

జిల్లాలోని 11 ఏకలవ్య పాఠశాలల్లో గెస్ట్‌ టీచర్‌ పోస్టులను అర్హులైన ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి డిమాండ్‌ చేశారు.

ఆదివాసీలతోనే గెస్ట్‌ టీచర్‌ పోస్టుల భర్తీ
మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి

- గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి డిమాండ్‌

పాడేరు రూరల్‌, సెప్టెంబరు 10: జిల్లాలోని 11 ఏకలవ్య పాఠశాలల్లో గెస్ట్‌ టీచర్‌ పోస్టులను అర్హులైన ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన ఉద్యోగులకు నివాళులర్పించి మౌనం పాటించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం శేషాద్రి మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో శతశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే కేటాయించాలన్నారు. తప్పుడు కుల ధ్రువపత్రాలు పొందిన బోగస్‌ ఎస్టీలను గ్రామ సభల ద్వారా గుర్తించాలన్నారు. వారిపై సమగ్ర విచారణ జరిపి సర్టిఫికెట్లు రద్దు చేయించాలన్నారు. యర్రవరంలో నిర్మించతలపెట్టిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని, ఆదివాసీ ప్రాంతంలో గిరిజన చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయపల్లి సింహాచలం, సీహెచ్‌ బాలకృష్ణ, ఎల్‌.వెంకటరమణదొర, వి.రామారావు, పి.నందు, ఎం.ప్రసాదరావు, బి.రాంబాబు, ఎస్‌.గురుదొర, ముఖి రామకృష్ణ, ఎన్‌.అప్పన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-11T06:24:52+05:30 IST