ప్రేమించి మోసగించిన యువకుడు

ABN , First Publish Date - 2022-09-28T06:35:59+05:30 IST

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడితోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు నర్సీపట్నం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

ప్రేమించి మోసగించిన యువకుడు
గొలుగొండలో బాధితురాలి ఇంటి వద్ద విచారణ చేపడుతున్న రూరల్‌ సీఐ శ్రీనివాస్‌

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

మరుసటి రోజే ఆ యువకుడికి మరో యువతితో వివాహం

నర్సీపట్నం సీఐ శ్రీనివాస్‌ విచారణ 

నలుగురిపై కేసు నమోదు


 గొలుగొండ, సెప్టెంబరు 27: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడితోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు నర్సీపట్నం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆ యువకుడు నర్సీపట్నానికి చెందిన మరో మహిళతో వివాహం అయ్యింది. ఈ కేసుపై మంగళవారం గొలుగొండలో యువతి ఇంటి వద్ద సీఐ విచారణ చేపట్టారు. అనంతరం సీఐ శ్రీనివాస్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. 

మండలంలో గొలుగొండ గ్రామానికి చెందిన తల్లి, తండ్రి లేని యువతి, అదే గ్రామానికి చెందిన కోనా శ్యాంమ్‌ప్రసాద్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో తనను వివాహం చేసుకోవాలని యువతి శ్యామ్‌ప్రసాద్‌ను కోరగా నిరాకరించాడు. అంతేకాకుండా నీ ఇష్టం వచ్చిన వారితో చెప్పుకోవాలని శ్యామ్‌ప్రసాద్‌ అనడంతో ఈనెల 21వ తేదీన ఆ యువతి గొలుగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ మరుసటి రోజు ఈనెల 22వ తేదీన శ్యామ్‌ప్రసాద్‌ నర్సీపట్నానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నట్టు విచారణలో తేలినట్టు సీఐ శ్రీనివాస్‌ చెప్పారు. దీనిపై   గ్రామంలో విచారణ చేపట్టగా.. ఆ యువతీ, శ్యామ్‌ప్రసాద్‌ కొంతకాలంగా పెళ్లి చేసుకుంటామని కలిసి తిరిగారని స్థానికులు చెప్పినట్టు ఆయన చెప్పారు. యువతికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతిచెందడంతో బాబాయి ఇంటి వద్ద ఉంటుందని తెలిపారు. విచారణ అనంతరం కోనా శ్యామ్‌ప్రసాద్‌, తల్లిదండ్రులు కోనా లక్ష్మణరావు, సుబ్బలక్ష్మి, బావ ముత్యాల శ్రీనులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. విచారణలో స్థానిక ఎస్‌ఐ నారాయణరావు పాల్గొన్నారు.  

Read more