గిరిజన మహిళననే చులకనగా చూస్తున్నారా?

ABN , First Publish Date - 2022-11-23T00:52:50+05:30 IST

‘ప్రభుత్వ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, ఆహ్వానం ఇవ్వకుండా నన్ను అవమానపరుస్తున్నారు. నేను ప్రభుత్వంలో భాగం కాదా..?’’ అని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధికార యంత్రాంగాన్ని నిలదీశారు. ‘ఆదిమ జాతి గిరిజన మహిళననే చులకన భావంతోనే నన్ను అవమానపరుస్తున్నారా?’...అంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలో మంగళవారం ఆశ్రమ పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆమె...సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సమక్షమంలోనే బహిరంగంగా తనకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు.

గిరిజన మహిళననే  చులకనగా చూస్తున్నారా?
డుంబ్రిగుడలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

అధికారులపై విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ఆగ్రహం

ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ

ఎందుకీ వివక్ష

- నేను ప్రభుత్వంలో భాగం కాదా?

- అరకులోయ నియోజకవర్గంలో తనకు అవమానం జరుగుతోందని ఆవేదన

పాడేరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, ఆహ్వానం ఇవ్వకుండా నన్ను అవమానపరుస్తున్నారు. నేను ప్రభుత్వంలో భాగం కాదా..?’’ అని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధికార యంత్రాంగాన్ని నిలదీశారు. ‘ఆదిమ జాతి గిరిజన మహిళననే చులకన భావంతోనే నన్ను అవమానపరుస్తున్నారా?’...అంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలో మంగళవారం ఆశ్రమ పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆమె...సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సమక్షమంలోనే బహిరంగంగా తనకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. ఈరోజు ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా తన పేరు లేదని, అరకులోయ ప్రాంతంలో జరిగిన పెట్రోల్‌ బంకు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోగా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. అలాగే తన సొంత మండలం ముంచంగిపుట్టులోని పెట్రోల్‌ బంకు ప్రారంభోత్సవాన్ని సైతం టీడీపీ సర్పంచ్‌తో చేయించారన్నారు. అదేమిటని ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణను అడిగితే, సంబంధం లేని విషయమని సమాధానం చెప్పారన్నారు. ఇది తొలిసారి కాదని, అరకులోయ నియోజకవర్గంలోని అనేక కార్యక్రమాల్లో తన పట్ల వివక్ష చూపుతూ, ప్రొటోకాల్‌ పాటించడం లేదన్నారు. ఇన్నాళ్లూ ఓపికపట్టి ఉన్నానని, ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం ముందు తెలియజేస్తున్నానని సుభద్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు ప్రథమ పౌరురాలైన తన పట్ల ప్రొటోకాల్‌ రహితంగా అధికార యంత్రాంగం ప్రవర్తించడం చాలా ఘోరమన్నారు. తనకు జరుగుతున్న అవమానంపై జిల్లా కలెక్టర్‌ వివరణ ఇవ్వాలని ఈ సందర్బంగా ఆమె డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌కు ప్రొటోకాల్‌ పాటించకపోతే ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ పదవికి ఏ గౌరవం ఇచ్చినట్టో అధికారులు చెప్పాలన్నారు.

Updated Date - 2022-11-23T00:52:50+05:30 IST

Read more