యూనియన్‌ కార్యాలయాన్ని ముట్టడించిన ఎల్‌అండ్‌ఎం సిరీస్‌ కార్మికులు

ABN , First Publish Date - 2022-09-30T05:59:20+05:30 IST

షిప్‌యార్డ్‌ ఎల్‌అండ్‌ఎం సిరీస్‌ కార్మికులు తమ ఉద్యోగ భద్రత అంశంపై గురువారం గుర్తింపు యూనియన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

యూనియన్‌ కార్యాలయాన్ని ముట్టడించిన ఎల్‌అండ్‌ఎం సిరీస్‌ కార్మికులు

మల్కాపురం, సెప్టెంబరు 29: షిప్‌యార్డ్‌ ఎల్‌అండ్‌ఎం సిరీస్‌ కార్మికులు తమ ఉద్యోగ భద్రత అంశంపై గురువారం గుర్తింపు యూనియన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో సంస్థలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫిక్స్‌డ్‌ టెర్మ్‌ ఎంప్లాయీస్‌ (ఎఫ్‌టీఈ) లేఖ పేరుతో తమ బతుకులను షిప్‌యార్డు యజమాన్యం నాశనం చేయాలని చూస్తుందని, గుర్తింపు యూనియన్‌ నాయకులుగా మీరు ఎటువంటి చర్యలు చేపడతారని నిలదీశారు. కార్మికుల తరపున సంస్థ యజమాన్యంతో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌టీఈ లేఖపై తాము సంతకాలు చేయకపోతే ఇళ్లకు లేఖలు పంపుతామని సంస్థ యాజమాన్యం చెబుతుందని, వాటిని తీసుకోవద్దని కుటుంబ సభ్యులకు కూడా చెప్పామని కార్మికులు పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపరంగా పోరాడుతామని కార్మికులు చెబుతున్నారు. ఈ అంశంపై యూనియన్‌ నాయకులు తమకు సంపూర్ణ మద్దతునివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో గుర్తింపు యూనియన్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎఫ్‌టీఈ లేఖలపై కార్మికులు ఎవరూ సంతకాలు చేయవద్దని, సంతకాలు పెడితే సర్వీస్‌ అంతా పోతుందని, అంతేకాక యజమాన్యం విధించే కొత్త కొత్త నిబంధనలను కూడా ఒప్పుకున్నట్టే అవుతుందని యూనియన్‌ నాయకులు పేర్కొన్నారు. దీనిపై అవసరమైతే చట్ట ప్రకారం పోరాటం చేసేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని యూనియన్‌ నాయకులు కార్మికులకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. 

మిగిలిన యూనియన్ల ప్రేక్షక పాత్ర!

తమ సమస్య ఇంత తీవ్రంగా వున్నప్పటికీ మిగిలిన కార్మిక సంఘాల నాయకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఎల్‌అండ్‌ఎం సిరీస్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు యూనియన్‌తో పాటు మిగతా యూనియన్లు కూడా కలిసివస్తే తమకు న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-09-30T05:59:20+05:30 IST