స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-25T03:48:57+05:30 IST

స్కూల్‌ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.

స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

వెనుక నుంచి ఢీకొన్న లారీ.. ముగ్గురికి స్వల్ప గాయాలు

డ్రైవర్‌ చాకచక్యంతో సురక్షితం

నక్కపల్లి, నవంబరు 24: స్కూల్‌ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాయకరావుపేట ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు 45 మంది విద్యార్థులతో గురువారం సాయంత్రం ఐదు గంటలకు నక్కపల్లి వైపు బయలుదేరింది. అందులో నక్కపల్లి, అడ్డరోడ్డు, పెదగుమ్ములూరు, తిమ్మాపురం గ్రామాలకు చెందిన బాలబాలికలు ఉన్నారు. నక్కపల్లి గురుకులం వద్ద ఇద్దరు పిల్లలను దింపేందుకు ఆరు గంటల ప్రాంతంలో డ్రైవర్‌ బస్సు ఆపాడు. అదే సమయంలో తుని నుంచి అనకాపల్లి వైపు వేగంగా వెళుతున్న లారీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో బస్సు హైవే డివైడర్‌ పైకి దూసుకుపోయి పక్కకు వాలిపోయింది. బస్సు డ్రైవర్‌ డీఎ్‌సఎన్‌ రాజు అప్రమత్తమై.. బలంగా బ్రేకును నొక్కి ఉంచడంతో పక్కనే ఉన్న కల్వర్టులోకి బోల్తా పడకుండా ఆగింది. బస్సులోని పిల్లలు ఆందోళనతో హాహాకారాలు చేశారు. స్థానికులు పిల్లలను కిందకు దింపారు. నక్కపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి గురుసాయి తలకు గాయమైంది. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పరారైన లారీ డ్రైవర్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Updated Date - 2022-11-25T03:48:57+05:30 IST

Read more