స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-25T00:57:33+05:30 IST

స్కూల్‌ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. నక్కపల్లిలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. పాయకరావుపేట శ్రీప్రకాష్‌ విద్యా సంస్థలకు చెందిన బస్సు సుమారు 45 మంది విద్యార్థులతో గురువారం సాయంత్రం ఐదు గంటలకు నక్కపల్లి వైపు బయలుదేరింది.

స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం
స్కూల్‌ బస్సును ఢీకొన్న లారీ

వెనుక నుంచి ఢీకొన్న లారీ

ముగ్గురికి స్వల్ప గాయాలు

డ్రైవర్‌ చాకచక్యంతో సురక్షితంగా బయటపడిన వైనం

నక్కపల్లి, నవంబరు 24: స్కూల్‌ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. నక్కపల్లిలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. పాయకరావుపేట శ్రీప్రకాష్‌ విద్యా సంస్థలకు చెందిన బస్సు సుమారు 45 మంది విద్యార్థులతో గురువారం సాయంత్రం ఐదు గంటలకు నక్కపల్లి వైపు బయలుదేరింది. అందులో నక్కపల్లి, అడ్డరోడ్డు, పెదగుమ్ములూరు, తిమ్మాపురం గ్రామాలకు చెందిన బాలబాలికలు ఉన్నారు. నక్కపల్లి గురుకులం వద్ద ఇద్దరు పిల్లలను దింపేందుకు ఆరు గంటల ప్రాంతంలో డ్రైవర్‌ బస్సును ఆపాడు. అదే సమయంలో తుని నుంచి అనకాపల్లి వైపు వేగంగా వెళుతున్న లారీ ఆగివున్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో బస్సు హైవే డివైడర్‌ పైకి దూసుకుపోయి పక్కకు వాలిపోయింది. పిల్లలు భయంతో హాహాకారాలు చేశారు. ప్రమాదంతో వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ డీఎస్‌ఎన్‌ రాజు బలంగా బ్రేకును నొక్కి ఉంచడంతో పక్కనే వున్న కల్వర్టులోకి బోల్తా పడకుండా ఆగింది. ఈ ఘటనలో పిల్లలు ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఏం జరిగిందో తెలియక అంతా ఏడ్వసాగారు. స్థానికులు పిల్లలను కిందకు దింపారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆందోళనతో హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో నక్కపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి ఉప్పలపు గురుసాయి తలకు గాయమైంది. తొమ్మిదో తరగతి చదువుతున్న నున్న హాసిని, ఐదో తరగతి చదువుతున్న డి.వాసు స్వల్పంగా గాయపడ్డారు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ వీసం నానాజీ, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కోసూరి శ్రీను, టీడీపీ నాయకుడు అడ్డూరి చిన్న, తదితరులు అక్కడకు చేరుకున్నారు. నక్కపల్లి ఎస్‌ఐ శిరీష ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే, ప్రమాదం జరిగిన వెంటనే లారీని విడిచి డ్రైవర్‌ పరారయ్యాడు.

Updated Date - 2022-11-25T00:57:33+05:30 IST

Read more