రైతాంగ సమస్యలపై దశలవారీ పోరాటం

ABN , First Publish Date - 2022-11-17T00:41:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గడచిన మూడున్నరేళ్లుగా వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి రైతులను నట్టేట ముంచిందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

రైతాంగ సమస్యలపై దశలవారీ పోరాటం
విలేకరులతో మాట్లాడుతున్న తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో పల్లా, నాగజగదీశ్వరరావు, దువ్వారపు రామారావు ఉన్నారు

ధాన్యం సేకరణలో ఇబ్బందులపై మండపేటలో ఆందోళన రేపు

ఆక్వా సమస్యలపై వచ్చే నెల 12న మత్స్యశాఖ కార్యాలయం ముట్టడి

మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు నిరసనగా వచ్చే నెల 26న అన్ని జిల్లాల్లో విద్యుత్‌ సంస్థల ఎస్‌ఈ కార్యాలయాల వద్ద నిరసన

తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

విశాఖపట్నం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గడచిన మూడున్నరేళ్లుగా వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి రైతులను నట్టేట ముంచిందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. దేశంలో అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఇతర వృత్తుల వైపు వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం చేయాలని తెలుగు రైతు విభాగం నిర్ణయించినట్టు చెప్పారు. దీనిలో భాగంగా ధాన్యం సేకరణలో ఇబ్బందులపై శుక్రవారం కాకినాడ జిల్లా మండపేటలో 20 వేల మంది రైతులతో ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని కాదని వైసీపీ సొంత మనుషులైన వలంటీర్లను భాగస్వామ్యం చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పంట వేసినప్పటి నుంచి కోత, నూర్పు, సంచిలో ధాన్యం నింపేంత వరకు ప్రతిదీ వలంటీర్‌ ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తేనే మిల్లర్లు కొనుగోలు చేయాలని ఆదేశించడం దారుణమన్నారు. టమాటా ధర అర్ధ రూపాయికి పడిపోవడంతో రాయలసీమలో రైతులు రోడ్లపై పారబోస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటాకు గిట్టుబాట ధర కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని మర్రిడ్డి ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో వరి పంటకు దోమకాటు తెగులు సోకడంతో రైతులు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రైతుకు పంట నష్టం చెల్లింపుపై జూన్‌ 14న అనంతపురంలో సీఎం బటన్‌ నొక్కినా...ఇంతవరకు 30 శాతం మంది రైతుల ఖాతాలకు నగదు చేరలేదన్నారు. రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించిన జాబితాల మేరకు తమ ప్రతినిధులు విచారణ జరిపితే 70 శాతం మంది తమకు సొమ్ములు అందలేదని చెబుతున్నారన్నారు. దీనికి నిరసనగా ఈనెల 28న కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెలలో ఆక్వా పంట సాగు చేయాల్సిన రైతులు...ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా క్రాప్‌హాలీడే ప్రకటించారన్నారు. ఆక్వా రంగంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే ఇందుకు కారణమన్నారు. విశాఖలో అడ్డగోలు దందాలు, మద్యం సిండికేట్ల ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్మును ఆంధ్రా శశికళ విజయసాయిరెడ్డి ఆక్వాలో పెట్టుబడులు పెట్టి ఆ రంగాన్ని కబ్జాకు నిర్ణయించడంతో సమస్య తలెత్తిందని ఆరోపించారు. రాష్ట్రంలో 1.6 లక్షల మంది ఆక్వా రైతుల బతుకులు ప్రమాదంలో పడ్డాయని, వారికి అండగా వుండేందుకు వచ్చే నెల 12న మత్స్యశాఖ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పేరిట రైతు మెడకు ఉరితాళ్లు బిగించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇది ఏపీలో సుమారు 16 లక్షల మంది రైతులకు తీవ్రభారంగా మారనున్నదన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి బంధువు విశ్వేశ్వరరెడ్డి ఎలక్ట్రికల్‌ కంపెనీకి తయారుచేసిన మీటర్లు కొనుగోలుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ఇంకా విండ్‌, సోలార్‌ పవర్‌ ఉత్పత్తిలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న అదాని, అంబానీలకు మేలు చేకూర్చేందుకు మోటార్లకు మీటర్లు ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. దీనికి నిరసనగా వచ్చే నెల 26న అన్ని జిల్లాల్లో విద్యుత్‌ సంస్థల ఎస్‌ఈ కార్యాలయాల వద్ద నిరసన తెలపనున్నట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో టీడీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగదీశ్వరరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ హయాంలో రైతుల పట్ల నిర్లక్షం

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జోన్‌-1 పరిఽధిలో ఉత్తరాంధ్ర జిల్లాల తెలుగు రైతు సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. తెలుగురైతు విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు తెలుగు రైతు కమిటీలు నియామకం పూర్తికావాలన్నారు. పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయానికి స్వస్తిచెప్పేందుకు రైతులు ఆలోచన చేస్తున్నారంటే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు బుద్దా నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో నీటి పారుదల రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. గడచిన మూడున్నరేళ్లలో జిల్లాలో గ్రోయన్లు, కాలువలు, చెక్‌డామ్‌లు మరమ్మతులు చేపట్టలేదన్నారు. ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల చక్కెర కర్మాగారాలు మూసివేశారన్నారు. పరిశ్రమలమంత్రిగా ఉన్న అమర్‌నాథ్‌ తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని విక్రయించే పనిలో ఉన్నారన్నారు. సమావేశంలో పార్లమెంట్‌ నాయకుడు ఎం.శ్రీభరత్‌, భీమిలి పార్టీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, ప్రధాన కార్యదర్శి సుధాకరరావు, కార్యదర్శి జల్లు చంద్రమౌళి, పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు తిక్కన చినదేముడు, బలరాం, ఒమ్మి ఆనందరావు, వెంకటనాయుడు, శ్రీరామ్మూర్తితోపాటు డీఎఎన్‌. రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:41:54+05:30 IST