ఉరకలేస్తున్న మత్స్యగెడ్డ

ABN , First Publish Date - 2022-09-13T06:18:57+05:30 IST

గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా మత్స్యగెడ్డ పాయల్లో వరద నీటి ఉధృతి తగ్గడం లేదు. దీంతో గెడ్డ పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

ఉరకలేస్తున్న మత్స్యగెడ్డ
ముంచంగిపుట్టు మండలం దొరగూడ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కర్రల సహాయంతో గెడ్డ దాటిస్తున్న దృశ్యం

తగ్గని వరద నీటి ఉధృతి                  

రాకపోకలకు తప్పని ఇబ్బందులు


ముంచంగిపుట్టు, సెప్టెంబరు 12: గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా మత్స్యగెడ్డ పాయల్లో వరద నీటి ఉధృతి తగ్గడం లేదు. దీంతో గెడ్డ పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 23 పంచాయతీల్లో సుమారు 100కుపైగా గ్రామాలు మత్స్యగెడ్డ పాయలు అవతల ఉన్నాయి. వాటిపై కల్వర్టులు, వంతెనలు నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతులు అందించినా ఫలితం లేకపోయిందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మండల పరిధిలో బంగాపుట్టు, లక్ష్మీపురం, బూసిపుట్టు, రంగబయలు, బంగారుమెట్ట, పెదగూడ, దారెల తదితర పంచాయతీల్లోని పలు గ్రామాల్లో మత్స్యగెడ్డ, గెడ్డ పాయలు వరద నీటితో ఉధృతి తగ్గలేదు. లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ, బిర్రుగూడ, కర్లాపొదర్‌, ఉబ్బెంగుల, జబడ, సంగంవలస తదితర ప్రాంతాల సమీపాల్లో మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృ తంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అటుగా ద్విచక్ర వాహనం సైతం నడపలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితిలో ద్విచక్ర వాహనాలను కర్రల సహాయంతో గెడ్డలు దాటిస్తున్నారు. మత్స్యగెడ్డ పాయలపై కల్వర్టులు, వంతెనల సౌకర్యం లేకపోవడం వల్ల వర్షం కురిస్తే రాకపోకలకు అవరోధం ఏర్పడుతోందని గెడ్డ అవతల జీవనం సాగిస్తున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్లలేక ఇళ్లకే పరిమితం కావలసి వస్తోం దని, దీని వల్ల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతోందని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గెడ్డ పాయలపై  కల్వర్టులు, వంతెనలు, కాజ్‌వేలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


ఆకాశం మేఘావృతం

పాడేరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో సోమవారం పాడేరులో మబ్బుల వాతావరణం కొనసాగింది. ఉదయం నుంచి ఎండ కాయనప్పటికీ వర్షం మాత్రం కురవడలేదు. దీంతో పాడేరు వాసులు ఊపిరిపీల్చుకున్నారు.  


Updated Date - 2022-09-13T06:18:57+05:30 IST