Iconic Bridge: కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి రూ.436 కోట్లు

ABN , First Publish Date - 2022-11-25T02:57:50+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన రోడ్డు ప్రాజెక్టులకు రూ.573.13 కోట్ల నిధులను విడుదల చేస్తూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు.

Iconic Bridge: కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి రూ.436 కోట్లు

హైదరాబాద్‌-తిరుపతి మధ్య తగ్గనున్న 80 కి.మీ. దూరం!

న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన రోడ్డు ప్రాజెక్టులకు రూ.573.13 కోట్ల నిధులను విడుదల చేస్తూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆ మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా జాతీయ రహదారి 167కే అభివృద్ధి పనుల్లో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రహదారి వల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దూరం దాదాపు 80 కిలోమీటర్ల మేర తగ్గనుంది. అంతేకాకుండా కొల్లాపూర్‌ వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి ఇరు రాష్ట్రాలకు గేట్‌వేగా నిలుస్తుంది. ఇది రెండు రాష్ట్రాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదం చేస్తుంది. అలాగే రూ.136.22 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి 163 (హైదరాబాద్‌ - భూపాలపట్నం)పై ములుగులో ప్రస్తుతమున్న రెండు లైన్ల రోడ్డు విస్తరణకు ఆమోదించారు. దీనివల్ల లక్నవరం, బొగథ జలపాతం వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలకు రోడ్డు సదుపాయం మెరుగవుతుందని కేంద్రమంత్రి తెలిపారు.

Updated Date - 2022-11-25T08:21:59+05:30 IST