ప్రభుత్వ భూమి కబ్జా

ABN , First Publish Date - 2022-03-16T05:36:56+05:30 IST

ప్రభుత్వ భూములను ఆక్రమించి మామిడి, జీడిమామిడి తోటలు వేసిన కబ్జాదారులు మరో అడుగు ముందుకు వేసి పక్కా నిర్మాణాలు చేపట్టారు.

ప్రభుత్వ భూమి కబ్జా
అక్రమించిన ప్రభుత్వ భూమిలో చేపట్టిన ఇంటి నిర్మాణం

మామిడి, జీడిమామిడి తోటలు సాగు

‘99 సంవత్సరాల లీజు’ పేరుతో అనధికార విక్రయాలు

దర్జాగా ఇళ్లు, రేకుల షెడ్ల నిర్మాణం

అధికార పార్టీ నేతలు కావడంతో చర్యలకు అధికారులు వెనకడుగు


మాకవరపాలెం, మార్చి 15: ప్రభుత్వ భూములను ఆక్రమించి మామిడి, జీడిమామిడి తోటలు వేసిన కబ్జాదారులు మరో అడుగు ముందుకు వేసి పక్కా నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది వీటిని అద్దెకు ఇచ్చేసి ఆదాయం పొందుతున్నారు. ఆక్రమణదారుల్లో అత్యధికులు అధికార పార్టీ నాయకులు కావడంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. 

మండలంలోని రాచపల్లి రెవెన్యూ ఎరకన్నపాలెం గ్రామంలో సర్వే నంబరు 737లో 1,450 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి సరిహద్దుల విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తున్నది. దీనిని అవకాశంగా తీసుకుని కొంతమంది అక్రమార్కులు  రెండు మూడు దశాబ్దాల క్రితం సుమారు 200 ఎకరాల మేర ఆక్రమించారు. మామిడి, జీడిమామిడి తోటలు సాగు చేసుకుంటూ ఫలసాయాన్ని అనుభవిస్తున్నారు. ఈ భూములపై వారికి ఎటువంటి పట్టాలు జారీ కాలేదు. కనీసం సాగులో వున్నట్టు రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదవ్వలేదు. అయినప్పటికీ కొంతమంది ఆక్రమణదారులు ‘99 సంవత్సరాల లీజు’ పేరుతో ఇతరులకు ఎకరా రూ.2-3 లక్షలకు అనధికారికంగా విక్రయిస్తున్నారు. కన్నూరిపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గతంలో ఆక్రమించిన 14 ఎకరాలను ఇటీవల గిడుతూరు గ్రామస్థులకు విక్రయించగా, వాళ్లు సరిహద్దు రాళ్లు పాతారు. మాకవరపాలెం గ్రామానికి చెందిన వ్యాపారి ఒకరు సుమారు 30 ఎకరాలను ఆక్రమించి, జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. కాగా ఆక్రమించిన భూముల్లో కొంతమంది ఇళ్లు, షెడ్ల నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇస్తున్నారు.  

ఎరకన్నపాలెంలో ప్రభుత్వ భూముల కబ్జాపై తహసీల్దార్‌ రాణి అమ్మాజీని వివరణ కోరగా, ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని చెప్పారు. తొలుత కట్టడాలు కూల్చివేయించి, అనంతరం భూముల స్వాధీనంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. కట్టడాల కూల్చివేతకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐని కోరినట్టు చెప్పారు.


Read more