1,500 గజాలకు బదులు 15 ఎకరాలా!?

ABN , First Publish Date - 2022-10-04T07:16:45+05:30 IST

దశాబ్దాలుగా వివాదాల్లో నడుస్తున్న దసపల్లా భూములను అప్పన్నంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తూ వాటికి అధికార పార్టీ వైసీపీ పెద్దలు రకరకాల కథలు చెబుతున్నారు.

1,500 గజాలకు బదులు 15 ఎకరాలా!?

అసలు ఎలా ఇస్తారు

1976లో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం కింద రాణి కమలాదేవి నుంచి దసపల్లా భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

నిబంధనల ప్రకారం 1500 గజాలు కేటాయింపు

తన ముగ్గురు కుమారులకు కూడా 1500 గజాలు కేటాయించాల్సిందిగా ఆమె విన్నపం

న్యాయస్థానంలో వివాదం?

అలా చూసినా...ఆమె అడిగింది 6 వేల గజాలే

ఆ విషయం మరుగునపరచి కథ నడిపిన వైనం

యూఎల్‌సీ కేసులు ఎన్ని తిరగదోడలేదు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దశాబ్దాలుగా వివాదాల్లో నడుస్తున్న దసపల్లా భూములను అప్పన్నంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తూ వాటికి అధికార పార్టీ వైసీపీ పెద్దలు రకరకాల కథలు చెబుతున్నారు. విశాఖ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు. ఈ కేసులు ఈనాటివి కాదు. ఎప్పటి నుంచో నలుగుతున్నాయి. ఆ భూములను 22-ఏలో చేర్చింది ఆషామాషీ వ్యక్తులు కాదు...ఐఏఎస్‌ అధికారులు. అయినా మసిపూసి మారేడు కాయ చేసేందుకు, ప్రశ్నించిన వారిదే తప్పు అన్నట్టు వైసీపీలో ఒకే ఒక వర్గం యత్నిస్తోంది.


కథ ఇలా నడిచింది

దసపల్లా భూములు ఎన్ని? అనే దానిపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన లెక్కలు చెబుతున్నారు. సర్వే నంబర్లు 1196, 1197, 1027, 1028లను చూపిస్తున్నా ఒకరు 60 ఎకరాలని, మరొకరు 82 ఎకరాలను చెబుతున్నారు. అసలు లెక్క చెప్పాల్సిన వారు మౌనం వహించారు. ప్రస్తుతం ప్రచారంలో వున్న వాదన ప్రకారం రాణీ కమలాదేవికి తండ్రి నుంచి 60 ఎకరాలు 1938లో దఖలు పడ్డాయి. ఆమె దరఖాస్తు చేసుకోగా 1958లో గ్రౌండ్‌ రెంట్‌ పట్టా లభించింది. 1976లో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ఎవరి దగ్గర ఎక్కువ భూమి ఉన్నా...కేవలం 1,500 గజాలు మాత్రమే వారికి ఇచ్చి మిగిలినది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ ప్రకారం అధికారులు ఆమెకు 1,500 గజాలు ఇచ్చి మిగిలింది తీసుకుంది. అయితే ఆమె తనకు ముగ్గురు కుమారులు ఉన్నారని, వారికి కూడా 1,500 గజాల చొప్పున ఇవ్వాలని అధికారులను కోరారు. దానిపై కేసు నడుస్తున్నట్టు సమాచారం. దానిని అధికారులు తెరపైకి తేలేదు. ముత్తాతల కాలం నాటి వివాదాలు వెలికితీసి భూములు లాక్కుంటున్న వైసీపీ పెద్దలు ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలి. యుఎల్‌సీ చట్టం ప్రకారం మిగులు భూములను రెగ్యులరైజ్‌ చేయించుకున్న వారిని కోర్టు తీర్పులున్నా సరే ఇంటికి వెళ్లి బెదిరించిన విషయం విశాఖ ప్రజలకు ఇంకా గుర్తుంది. మరిచిపోలేదు. అడిగిన మొత్తం ఇవ్వలేదని అధికారులను పంపించి, ఆ భూమిని స్వాధీనం చేసుకొని ‘ప్రభుత్వ భూమి’ అని బోర్డు పెట్టిన సంగతి అందరికీ తెలుసు. అదే యుఎల్‌సీ చట్టం ప్రకారం దసపల్లా భూములను కాపాడే అవకాశం ఉంది. దానిని ఎందుకు విస్మరిస్తున్నారు. ఎన్నికల ముందు దసపల్లా భూములను కాపాడతామని హామీ ఇచ్చి ఎలా మరిచిపోతారు?


కేసును దారిమళ్లించారు

రాణీ కమలాదేవి వద్ద విలువైన భూములు వున్నాయని తెలిసి దళారులు రంగంలోకి దిగారు. అధికారులతో కుమ్మక్కై కథ నడిపారు. యుఎల్‌సీ వివాదాన్ని పక్కనపెట్టి జమీందారు భూములంటూ కోర్టులకు వెళ్లి, అక్కడ ప్రభుత్వ తరఫున సకాలంలో సాక్ష్యాలు అందకుండా చేసి పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు. ఆ ప్రకారం వారికి ప్రభుత్వం తీసుకున్న 40 ఎకరాల భూములపై పరిహారం లభించింది. ఆ తరువాత జిల్లా అధికారులు మేల్కొని ఆ భూములను 22-ఏలో చేర్చడంతో 20 ఎకరాలు మిగిలాయి. అందులో 15 ఎకరాలను వివాదాల్లో వుండగానే రాణీ కమలాదేవి నుంచి పలువురు రాయించుకున్నారు. ఇప్పుడు వాటిని అభివృద్ధి చేసి అందులో భారీ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి నడుం కట్టారు. 22-ఏ నుంచి తప్పిస్తే తప్ప వీలుకాదని ‘తీర్పుల అమలు’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఆ తీర్పులు నిన్న, మొన్నటివి కాదు. వైసీపీ అధికారంలో వచ్చాక వచ్చినవి కూడా కాదు. అంతకు ముందే ఉన్నాయి. అయినా కోర్టు తీర్పులను గౌరవించే సంప్రదాయం ఇప్పుడున్న అధికార పార్టీకి ఎంత ఉందో...రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. వాటిని సాకుగా చూపించి ఆ భూములను ప్రైవేటుకు అప్పగించేలా చేస్తున్నారు.


ఇవీ అనుమానాలు

- రాణీ కమలాదేవికి ప్రస్తుతం 92 సంవత్సరాలు అని తాజాగా బయటపడిన డెవపలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌లో ఉంది. అంటే ఆమె 1930లో జన్మించి ఉంటారు. ఆమెకు 1938లో తండ్రి నుంచి భూములు దఖలు పడ్డాయని పత్రాల్లో చెబుతున్నారు. అంటే అప్పటికి ఆమె వయస్సు కళ్ల ముందు ఉన్న ఆధారాల ప్రకారం ఎనిమిదేళ్లు. అంటే మైనర్‌. ఆ వయస్సు నాటికే వాటాలు వేసి భూములు ఇచ్చారా? అనేది అనుమానం. దీనిని నివృత్తి చేయాల్సి ఉంది.  

- కమలాదేవి తనకు పిల్లల వాటాతో సహా మొత్తంగా ఆరు వేల గజాలు చాలు అంటూ యుఎల్‌సీ అధికారులను కోరినట్టు రికార్డులు చెబుతున్నాయి. దాని ప్రకారం ఆమెకు ఆ ఆరు వేల గజాలే ఇచ్చి, మిగిలిన భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోదు. అధికారులు గానీ, అధికార పార్టీ పెద్దలు గానీ ఈ ఆలోచన ఎందుకు చేయడం లేదు. 


దసపల్లా వ్యవహారంలో వెలుగులోకి కీలక డాక్యుమెంట్లు

వైసీపీ పెద్దల్లో ఆందోళన

వివరణ ఇవ్వాల్సిందిగా పలువురిపై ఒత్తిడి

రాణి కమలాదేవి లాయర్‌ ఇచ్చిన వివరణను తెలుగులోకి అనువదించి వైసీపీ గ్రూపులో పోస్టు చేసిన నేతలు


విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

దసపల్లా భూముల్లో బహుళ అంతస్థుల నిర్మాణానికి సంబంధించిన కుదుర్చుకున్న అగ్రిమెంట్లతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో వైసీపీ పెద్దల్లో అలజడి మొదలైంది. ఎష్యూర్‌ సంస్థకు హైదరాబాద్‌కు చెందిన అవియాన్‌ రియల్టర్‌ సంస్థ నుంచి నిధులు బదలాయింపు జరిగినట్టు, అలాగే కొందరికే ప్రయోజనం కలిగించేలా రూపొందించిన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంటు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రముఖుడి కుటుంబ సభ్యులకు సంబంధం వుందని ప్రచారం జరుగుతుండడంతో...అసలు ఆ డాక్యుమెంట్లు బయటకు ఎలా వచ్చాయని ఆయన ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. దసపల్లా భూముల వ్యవహారంలో వైసీపీ కీలక నేత ఒకరు అడ్డగోలుగా లబ్ధి పొందినట్టు నగరంలో ప్రచారం జరుగుతోంది. ఆయన కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం జరిగిందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. సదరు నేతకు వైసీపీలో ప్రత్యర్థిగా వున్న నేత అనుయాయులే ఆ కీలక డాక్యుమెంట్లు బయటపెట్టారని తెలిసింది. ఆ అనుయాయులు ఎవరన్నది కీలక నేత, ఆయన మద్దతుదారులు సమాచారం సేకరిస్తున్నారు. కాగా సుమారు మూడు వేల రూపాయల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో వైసీపీ కీలక నేత రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగానే రాణి కమలాదేవితో వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. భూముల వ్యవహారంలో ఎవరికీ సంబంధం లేదని, అది పూర్తిగా తమకు సంబంధించిన విషయమంటూ ఆమె  ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ భూములపై అనేక కథనాలు వచ్చినా స్పందించని కమలాదేవి....ఇప్పుడు వైసీపీ పెద్దల ఒత్తిడి మేరకు లాయర్‌ ద్వారా వివరణ ఇచ్చారనే ప్రచారం సాగుతుంది. రాణి కమలాదేవితోపాటు దసపల్లా భూములు కొనుగోలు చేసినవారు, వాటిని అభివృద్ధికి తీసుకున్న డెవలపర్ల నుంచి కూడా వివరణ ఇప్పించేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. కాగా ఈ భూముల వ్యవహారంతో సంబంధం లేదని చెబుతున్న కీలక నేత సూచన మేరకు ఆయన అనుచరులు...రాణి కమలాదేవి తరపున ఆదివారం న్యాయవాది ఇచ్చిన వివరణను సోమవారం తెలుగులోకి అనువదించి వైసీపీ గ్రూపుల్లో పోస్టు చేశారు. 

Read more