నాడు-నేడులో నిబంధనల ఉల్లంఘన

ABN , First Publish Date - 2022-09-10T09:05:48+05:30 IST

‘నాడు- నేడు’ పథకం అమలులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

నాడు-నేడులో నిబంధనల ఉల్లంఘన

ఆ హెచ్‌ఎంలపై కఠిన చర్యలు తప్పవు: పాఠశాల విద్యాశాఖ 

అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘నాడు- నేడు’ పథకం అమలులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. నాడు- నేడు పథకంపై సమీక్షించిన ఉన్నతాధికారులు.. అనంతరం జిల్లాల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.  పనుల కోసం కొంతమంది హెచ్‌ఎంలు ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని వారి వద్దే ఉంచుకుంటున్నారని, రూ.5 వేలకు మించి నగదు డ్రా చేయకూడదని స్పష్టంచేసింది. తల్లిదండ్రుల కమిటీల సంతకాలు తీసుకుని కొందరు బ్లాంక్‌ చెక్కులను తమ వద్ద ఉంచుకుంటున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. కొన్నిచోట్ల మెటీరియల్‌ కొనుగోలు పేరుతో బ్యాంకుల నుంచి నగదు డ్రా చేస్తున్నారని, కానీ ఆ మెటీరియల్‌ పాఠశాలల్లో కనిపించడం లేదని గుర్తించినట్లు తెలిపింది. కొనుగోలు చేసిన మెటీరియల్‌ను ప్రతి రోజూ స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించింది. స్టీలు కొనుగోలులో మార్కెట్‌ రేటు కంటే 20శాతం అదనపు ధర వెచ్చిస్తున్న విషయం కూడా వెలుగులోకి వచ్చిందని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కొందరు హెచ్‌ఎంలు సాంకేతిక సలహాలు తీసుకోకుండా అవసరమైన దానికంటే ఎక్కువస్థాయిలో మెటీరియల్‌ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

Read more