వాయు‘గండం’

ABN , First Publish Date - 2022-11-21T03:17:48+05:30 IST

దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో ఆదివారం ఉదయం బలపడి వాయుగుండంగా

వాయు‘గండం’

నేటి నుంచి దక్షిణ కోస్తా, సీమలో భారీ వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో ఆదివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆదివారం సాయంత్రానికి చెన్నైకు 570 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, కరైకల్‌కు 560 కి.మీ. తూర్పున కేంద్రీకృతమై ఉంది. ఇది ఈనెల 22న ఉదయం వరకు నిదానంగా వాయువ్య దిశలో పయనిస్తుంది. తరువాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడులో అక్కడక్కడా వర్షాలు కురవగా ఉత్తరకోస్తా, రాయలసీమలో అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించాయి. సోమవారం దక్షిణ కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాతీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ.లు, అప్పుడప్పుడు 65 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తున్నందున సోమ, మంగళ, బుధవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - 2022-11-21T03:17:48+05:30 IST

Read more