ఆ విషయంలో CID అజ్ఞానిలాగా వ్యవహరించింది: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-07-12T17:12:46+05:30 IST

సీఐడీ ఏడీజీకి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మంగళవారం లేఖ రాశారు.

ఆ విషయంలో CID అజ్ఞానిలాగా వ్యవహరించింది: వర్ల రామయ్య

అమరావతి: సీఐడీ ఏడీజీకి  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మంగళవారం లేఖ రాశారు. జూన్ 29వ తేదీన రాత్రి సీఐడీ పోలీసులు సంఘవిద్రోహుల వలే టీడీపీ నేత గార్లపాటి వెంకటేశ్వరరావు ఇంట్లోని గోడ దూకి తలుపులు పగులగొట్టి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారన్నారు. అలాగే జూన్30వ తేదీన ఉదయం టీడీపీ నేత మోకరాల సాంబశివరావును మంగళగిరిలోని అతని ఇంటి నుంచి బలవంతంగా అరెస్టు చేశారని చెప్పారు. అరెస్టు తర్వాత బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. వైఎస్‌ విజయమ్మ తన పదవికి రాజీనామా చేశారనే పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారనే అక్కసుతో బాధితులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అంతకు మునుపు పోస్ట్‌ల్లో పేర్కొన్నట్లుగానే వైఎస్ విజయమ్మ జూలై 8వ తేదీన వైసీపీ ప్లీనరీలో తన పదవికి రాజీనామా చేశారన్నారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా విచారించకుండా సీఐడీ  ఒక అజ్ఞానిలాగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. 


బాధితులను వేధింపులకు గురిచేయడమే కాకుండా బంధువులు, గ్రామస్తుల మధ్య  అవమానపడేలా మానసిక వేధింపులకు గురిచేశారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఐడీ సీఎం జగన్‌రెడ్డికి వ్యక్తిగత సైన్యంలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.సీఐడీ  రాజ్యాంగ బాధ్యతలను మరిచి ముఖ్యమంత్రి కోసమే పనిచేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సీఐడీ రాజ్యాంగం ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐడీ చేతిలో వేధింపులకు గురైన బాధితులకు సీఐడీ చీఫ్ క్షమాపణలు చెప్పాలని వర్ల రామయ్య లేఖలో డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-12T17:12:46+05:30 IST