ఉత్తుత్తి శంకుస్థాపన!

ABN , First Publish Date - 2022-11-21T02:55:29+05:30 IST

నరసాపురంలో సోమవారం జరిగే మత్స్యకార దినోత్సవ సమావేశంలో.. మత్స్యకార విశ్వవిద్యాలయం సహా రూ.2,437 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు.

ఉత్తుత్తి శంకుస్థాపన!

టెండర్లే పిలవని పనులకు నేడు సీఎం జగన్‌ భూమిపూజ

ఆ తర్వాత పిలిచి ఖరారు చేస్తారట!

‘కొల్లేరు’ రెగ్యులేటర్లపై సర్కారు తీరు

గతంలో ఒకసారి టెండర్లు పిలిస్తే

ముందుకురాని కాంట్రాక్టర్లు

బిల్లుల పెండింగే కారణం

ఈసారీ స్పందన అనుమానమే

అయినా భూమిపూజకు జగన్‌ రెడీ

నరసాపురంలో భూగర్భ డ్రైనేజీ,

విద్యుత్‌ ఉపకేంద్రం పనులకు కూడా

ఉత్తుత్తి బటన్‌ నొక్కుడులాంటిదే ప్రతిపక్షాల ఎద్దేవా

రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉత్తుత్తి బటన్‌ నొక్కుతున్నారని.. చాలా చోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము పడడమే లేదని ఇప్పటికే విమర్శలున్నాయి. తాజాగా టెండర్లే పిలవని ప్రాజెక్టులకు సోమవారం ఏకంగా ఆయన శంకుస్థాపనే చేయబోతున్నారు. ఇది ప్రతిపక్షాలకు పదునైన అస్త్రంగా మారింది.

భీమవరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నరసాపురంలో సోమవారం జరిగే మత్స్యకార దినోత్సవ సమావేశంలో.. మత్స్యకార విశ్వవిద్యాలయం సహా రూ.2,437 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. వీటిలో టెండర్లే పిలవని పనులు ఉండడమే విశేషం. కొల్లేటి మంచినీటి సరస్సు ఉప్పుకయ్యగా మారకుండా ఉండాలంటే ఉప్పుటేరుపై రెగ్యులేటర్లు నిర్మించాలన్నది ప్రజల చిరకాల వాంఛ. ఈ నేపథ్యంలో మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి జలవనరుల శాఖ రూ.420 కోట్లతో తొలుత అంచనాలు రూపొందించింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోళ్లపర్రు, ఆకివీడు మండలం దుంపగడప, కృష్ణా జిల్లా పడతడిక వద్ద ఈ రెగ్యులేటర్లు నిర్మించేందుకు ప్రణాళిక రచించారు. గతంలో ఒకసారి టెండర్లు పిలిచారు. కానీ జగన్‌ ప్రభుత్వం రూ.వేల కోట్ల విలువ చేసే చాలా బిల్లులను చెల్లించకుండా కాంట్రాక్టర్లను సతాయిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జలవనరుల శాఖ నిర్వహించిన వేసవి పనులకు సంబంధించి ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయలేదు.

దాదాపు రూ.60 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో ఏటా దాదాపు రూ.15 కోట్లతో నిర్వహించే వేసవి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు సుముఖత చూపడం లేదు. ఫలితంగా ఆ పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కాలువల మరమ్మతులూ చేపట్టలేని దుస్థితి. అటువంటిది వందల కోట్ల రూపాయల విలువైన పనులు తీసుకుంటే రేపు బిల్లులు మంజూరు చేస్తారా అన్న అనుమానం కాంట్రాక్టర్లలో నెలకొంది. అందుకే కొల్లేరు రెగ్యుటేలర్ల నిర్మాణం కోసం మొదట పిలిచిన టెండర్లకు వారు స్పందించలేదు. దరిమిలా అధికారులు మరోసారి ఎస్‌ఎ్‌సఆర్‌ ధరల్లో మార్పు చేశారు. దీంతో మూడు రెగ్యులేటర్ల నిర్మాణ అంచనా విలువ రూ.460 కోట్లకు చేరింది. అయితే ఇంకా టెండర్లు పిలవలేదు. పిలిచినా కాంట్రాక్టర్లు స్పందించేది అనుమానమే. అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి శంకుస్థాపనకు సిద్ధమయ్యారు. వాస్తవానికి రూ.180 కోట్లతో కొల్లేరు సరస్సును అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు రూ.1,000 కోట్లతో చేపడతామన్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులోనే ఇది కూడా భాగం. కానీ దీనిని అటకెక్కించేసి రెగ్యులేటర్లు కడతామంటూ ఏడాది నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేస్తున్నారు. టెండర్లు ఖరారవుతాయో లేదో తెలియకముందే ఏకంగా మోళ్లపర్రు వద్ద ఒక రెగ్యులేటర్‌కు సీఎం జగన్‌ సోమవారం శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేసేశారు.

విద్యుత్‌ ఉప కేంద్రానికి కూడా..

నరసాపురం మండలం రుస్తుంబాద వద్ద రూ.132.81 కోట్లతో విద్యుత్‌ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దానికి భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. పనులు మొదలుకావాలంటే టెండర్లు పూర్తి కావాలి. ఆ ప్రక్రియ మొదలే కాలేదు. నరసాపురం పట్టణంలో భూగర్భ మురుగునీటి పారుదల కోసం ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.237 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించనన్నుట్లు ప్రకటించింది. దానికీ టెండర్లు పూర్తికాలేదు. వీటికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. ఆయన చేసే శంకుస్థాపనలన్నీ నకిలీవేనని, ప్రజలను మభ్యపెట్టడానికే ఇలా చేస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అయినా జగన్‌ సర్కారు జంకడం లేదు.

Updated Date - 2022-11-21T02:55:29+05:30 IST

Read more