వర్సిటీల ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-05-18T09:45:28+05:30 IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు.

వర్సిటీల ఇష్టారాజ్యం

ప్రభుత్వ నిబంధనలు పట్టవు..

కోర్టు కేసుల కౌంటర్లలో నిర్లక్ష్యం

అనుమతుల్లేకుండా నియామకాలు

కొన్నిచోట్ల ఫైళ్లు, రికార్డులు గల్లంతు

విశ్వవిద్యాలయాల తీరుపై 

ఉన్నత విద్యాశాఖ ఆగ్రహం

రిజిస్ర్టార్లకు ముఖ్య కార్యదర్శి లేఖ


అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. అనుమతిలేకున్నా నియామకాలు చేపడుతూ.. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే వారికి పే స్కేల్స్‌ ఇచ్చేస్తున్నాయి. తప్పుచేసిన వారిపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలే తీసుకోవడం లేదు. అసలు ఆ తప్పులకు సంబంధించిన ఫైళ్లు కూడా ఒక్కోసారి కనిపించడం లేదు. అదే సమయంలో వీటికి సంబంధించి కోర్టుల్లో కేసులు వేసేటప్పుడు సరైన కౌంటర్లు, వివరాలు దాఖలు చేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఇవన్నీ ఎవరో గిట్టనివారు చేస్తున్న ఆరోపణలు కావు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న వ్యవహారాలను సాక్షాత్తూ ఉన్నత విద్యాశాఖే వెల్లడించింది. ఇలాంటి తప్పులు కొన్ని యూనివర్సిటీల్లోని రిజిస్ర్టార్లు కావాలని చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ర్టార్లకు మంగళవారం లేఖ రాశారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాల నుంచి అడ్వాన్సులు తీసుకున్న వారికి కూడా వారు పదవీ విరమణ చేసే సమయంలో ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ చెల్లించేస్తున్నారు. కనీసం సర్వీసులో ఉండగా వారు తీసుకున్న అడ్వాన్సులను కూడా మినహాయించడం లేదు. విశ్వవిద్యాలయాల ఫైనాన్స్‌ సెక్షన్లు నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కూడా ఇవ్వడం లేదు. తీరా పదవీ విరమణ సమయంలో అన్నీ సెటిల్‌ చేసిన తర్వాత ఆడిట్‌ లెక్కల్లో బొక్కలు కనిపిస్తున్నాయి. దీంతో తీసుకున్న అడ్వాన్స్‌లు చెల్లించాలని ఆయా ఉద్యోగులను కోరుతుండడంతో వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్న కేసుల్లో విశ్వవిద్యాలయాల తరఫున వాదించే స్టాండింగ్‌ కౌన్సిల్స్‌.. నిర్మాణాత్మక కౌంటర్లు వేయడం లేదు. న్యాయమూర్తుల ముందు వాదించేటప్పుడు చెప్తామంటూ కౌంటర్‌లో సరైన అంశాలు చేర్చడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇలాంటి కేసుల్లో కనీసం పేరా నంబర్లు, ఆ వ్యవహారం జరిగినప్పుడు ఉన్న మాజీ రిజిస్ర్టార్ల పేర్లు కూడా పెట్టకుండా కేసులు వేసేస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పలు నిర్దేశాలు జారీచేశారు. 


ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకుంటే చర్యలు

ఇకనుంచి ప్రభుత్వ ఉత్తర్వులను, మార్గనిర్దేశాలను కచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ర్టార్లు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుని.. ఆ విషయాన్ని ఉన్నత విద్యామండలి ఎగ్జిక్యూటివ్‌ మండలికి తెలపాలని శ్యామలరావు నిర్దేశించారు. ఫైళ్లు మిస్‌ అయిన కాలంలో పనిచేసిన సెక్షన్‌ ఇన్‌చార్జ్‌లను పిలిచి ఆ ఫైళ్ల గురించి ఆరా తీయాలన్నారు. ఫైళ్లు దొరకకుంటే పోలీసు కేసు పెట్టాలని, కోర్టు కేసుల విషయంలో సరైన చర్యలు తీసుకుని, వాటి పరిష్కారం కోసం పనిచేయని వారిని రిజిస్ర్టార్లు వివరణ అడగాలని సూచించారు. అదే సమయంలో ఉప కులపతులు, రిజిస్ర్టార్లు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా పే స్కేళ్లు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ఆ అధికారం వారికి లేదని తెలిపారు. ఉద్యోగులు తీసుకున్న అడ్వాన్సులను తిరిగి మినహాయించుకోవడంలో నిబంధనలను పాటించని ఫైనాన్స్‌ సెక్షన్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీల తరఫున కేసులు వాదించే స్టాండింగ్‌ కౌన్సిళ్లు సరైనవిధంగా కౌంటర్లు ఫైల్‌ చేయాలని.. అలా చేశారా? లేదా? అన్నదానిపై రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

Read more