పెరటాశి తర్వాత సర్వదర్శన టోకెన్ల జారీ

ABN , First Publish Date - 2022-09-25T09:44:35+05:30 IST

ప్రస్తుత పెరటాశి మాసం తర్వాత తిరుపతిలో రోజుకు 20 వేల చొప్పున స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీటితో పాటు టోకెన్‌ రహిత సర్వదర్శనాలనూ

పెరటాశి తర్వాత సర్వదర్శన టోకెన్ల జారీ

వీఐపీ బ్రేక్‌ దర్శన సమయం మార్పు

ఏటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం: టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి


తిరుమల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పెరటాశి మాసం తర్వాత తిరుపతిలో రోజుకు 20 వేల చొప్పున స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీటితో పాటు టోకెన్‌ రహిత సర్వదర్శనాలనూ కొనసాగిస్తామన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలో శనివారం జరిగింది. అనంతరం బోర్డు తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈసారి బ్రహ్మోత్సవాలను మాడవీధుల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, విశేషంగా భక్తులు రానున్న క్రమంలో మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కంపార్టుమెంట్లలో రాత్రి వేళ వేచిఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం 5 నుంచి 9 గంటల మధ్యలో ఉండే వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యకు మార్చాలని నిర్ణయించామన్నారు. బ్రహ్మోత్సవాల తర్వాత ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. తిరుమలలో గత ఆరు నెలలుగా భక్తుల రద్దీ అధికంగా ఉన్న క్రమంలో వసతికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని.. ఈ క్రమంలో తిరుమలలోని గదులను తిరుపతిలోనే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తద్వారా తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుందన్నారు.


సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే దిశగా.. ప్రస్తుతం వీఐపీ, శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోటాను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. టీటీడీకి చెందిన 7,123 ఎకరాల్లో ఉన్న 960 ఆస్తుల తుది జాబితాను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామని, వీటి విలువ రూ.85,705 కోట్లని చైర్మన్‌ తెలిపారు. ఇకపై ఏటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం సమర్పిస్తామన్నారు. 1974 నుంచి 2014 వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న 114 ఆస్తులను విక్రయించారని, ఆ తర్వాత ఆస్తులను విక్రయించలేదని తెలిపారు. తిరుమలలోని గోవర్దన సత్రాల వెనుకభాగంలో యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.98 కోట్లతో రివైజ్డ్‌ టెండర్లకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.  

Updated Date - 2022-09-25T09:44:35+05:30 IST