జోరు వానలో గిరిజనుల నిరసన

ABN , First Publish Date - 2022-09-08T09:23:28+05:30 IST

జోరు వానలో గిరిజనుల నిరసన

జోరు వానలో గిరిజనుల నిరసన

కలెక్టర్‌, ఎమ్మెల్యే వాహనాల అడ్డగింత


బుట్టాయగూడెం, సెప్టెంబరు 7: ఓ వైపు ఐటీడీఏ సమావేశం.. మరోవైపు హోరున వర్షం. అదే సమయంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ గిరిజనులు, నిర్వాసితులు ధర్నాలు నిర్వహించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురంలో బుధవారం ఐటీడీఏ సమావేశం నిర్వహించారు. కాగా, తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఐటీడీఏ బయట ఏపీ గిరిజన సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో గిరిజనులు, నిర్వాసితులు ధర్నాలు చేశారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు వర్షంలోనే వారితో కలెక్టర్‌ చర్చలు జరిపారు. పోడు భూములు, ఎల్‌టీఆర్‌ భూములకు పట్టాలు ఇవ్వాలని, మాతృభాషా వలంటీర్లను రెగ్యులర్‌ చేయాలని, వేతనాలు ఇవ్వాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఇక, ‘భూ సమస్యలు పరిష్కరిస్తారా? లేదంటే మమ్మల్ని పాత ఊరు వెళ్లిపొమ్మంటారా?’ అంటూ జీలుగుమిల్లి మండలం అంకంపాలెం నిర్వాసిత కాలనీలో ఉంటున్న కొరుటూరు నిర్వాసిత గిరిజనులు కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే తెల్లం బాలరాజును నిలదీశారు. కలెక్టర్‌ కారుకు అడ్డుగా నిలబడి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు.



Updated Date - 2022-09-08T09:23:28+05:30 IST