పాత విధానంలోనే టీచర్ల బదిలీ!

ABN , First Publish Date - 2022-10-12T09:11:25+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం మళ్లీ కీలక మార్పులు చేస్తోంది. ప్రతిసారీ టీచర్ల బదిలీలకు ఎనిమిదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటుండగా.. ఈసారి దానిని ఐదేళ్లకు కుదించింది. దీనిపై

పాత విధానంలోనే టీచర్ల బదిలీ!

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 5 ఏళ్లపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం 


అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం మళ్లీ కీలక మార్పులు చేస్తోంది. ప్రతిసారీ టీచర్ల బదిలీలకు ఎనిమిదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటుండగా.. ఈసారి దానిని ఐదేళ్లకు కుదించింది. దీనిపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన అందరికీ బదిలీకి అవకాశం ఇస్తామని ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించిన ఫైలు ఇప్పటి వరకు సీఎంవోలో పెండింగ్‌లో ఉంది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఐదేళ్ల నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ప్రస్తుత ఫైలు ఐదేళ్ల సర్వీసు ఆధారంగా ఉండగా దానిని ఎనిమిదేళ్లకు మార్చి తిరిగి పంపాలని ఆదేశించినట్లు సమాచారం.


ఎనిమిదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటే ఎక్కువ మంది మారాల్సిన అవసరం ఉండదు. అదే ఐదేళ్లు తీసుకుంటే ఇప్పుడు దాదాపు 80ు మందికి స్థానచలనం తప్పదనే అంచనా ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో అంతమందిని ఒకేసారి బదిలీ చేస్తే బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాగా, బదిలీలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం సాగదీత ధోరణి అవలంబిస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే ఉపాధ్యాయులకు ఇబ్బంది అవుతుందని ఇటీవల సంఘాలతో జరిగిన సమావేశంలో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీంతో బదిలీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే వాదన వచ్చింది. ఇప్పుడు మళ్లీ సర్వీసును మార్చే ప్రతిపాదన ముందుకు తెచ్చింది. కొత్త ప్రతిపాదనతో ఫైలు పెట్టినా ఎప్పటికి దానికి ఆమోదముద్ర పడుతుందో స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more