Tirupati Tdpలో ఏంటీ పరిస్థితి?. చంద్రబాబుకు తప్పదా!

ABN , First Publish Date - 2022-07-28T00:57:29+05:30 IST

సాధారణంగా.. ఏపీ (Ap)లో ఏ పార్టీ అధికారంలోఉంటే ఆ పార్టీ వారే టౌన్‌బ్యాంక్‌ పాలకవర్గంగా ఉంటారు. దీనికి అనుగుణంగానే అధికారులు వ్యవహరిస్తారు. తొ..

Tirupati Tdpలో ఏంటీ పరిస్థితి?. చంద్రబాబుకు తప్పదా!

తిరుపతి (Tirupati): సాధారణంగా.. ఏపీ (Ap)లో ఏ పార్టీ అధికారంలోఉంటే ఆ పార్టీ వారే టౌన్‌బ్యాంక్‌ పాలకవర్గంగా ఉంటారు. దీనికి అనుగుణంగానే అధికారులు వ్యవహరిస్తారు. తొలిసారి టీడీపీ (Tdp).. ఢీ అంటే ఢీ అనడంతో తిరుపతి ఎమ్మెల్యేకి ఈ ఎన్నిక సవాలుగా మారింది. అసలే.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy)కి అధిష్టానం దగ్గర మెరుగైన మార్కుల్లేవు. దీంతోపాటు టౌన్‌బ్యాంకు చేజారితే మొదటికే మోసం వస్తుందనే ఆందోళనతో భూమన వర్గం తొలి నుంచే దూకుడు ప్రదర్శించింది. దీన్ని గుర్తించి తగిన వ్యూహం అనుసరించడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారు. టౌన్‌ బ్యాంకు (Town Bank) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలేంటి?.. అభ్యర్థులెవరు.. వారి బలాబలాలేంటి?.. అభ్యర్థుల ఆర్ధిక సామర్ధ్యం ఎంత?.. ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుంది?.. పోలింగ్‌ రోజు ఎలా వ్యవహరించాలనే అంశాల్లో సరైన అంచనా, వ్యూహం లేకుండానే ఎన్నికలకు దిగినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఉప ఎన్నికలు (LokhSabha By Poll), కార్పొరేషన్‌ ఎన్నికల నుంచి కూడా టీడీపీ నేతలు దూకుడుగా వ్యవహరించడంలో విఫలం అయ్యారని టౌన్‌బ్యాంక్‌ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. 


వాటిని బ్రేక్‌ చేసి మరీ...

నామినేషన్ల ప్రక్రియ నుంచే అధికార పార్టీ దందా మొదలవుతుందని అందరికీ తెలుసు. అయితే... వైసీపీ (Ycp) ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా వాటిని బ్రేక్‌ చేసి మరీ.. 12 డైరెక్టర్‌ పోస్టులకు మాత్రం నామినేషన్లు వేశారు. కానీ.. పోలింగ్‌ను ఎదుర్కోవడంలో మాత్రం చతికిల పడ్డారు. పోలింగ్‌కి ముందు రోజే ముఖ్య నేతలను నిర్బంధించడం, యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలను బెదిరించడంలో వైసీపీ దిట్ట. అయితే.. వైసీపీ స్ట్రాటజీ ఏంటో తెలిసి కూడా టీడీపీ నేతలు ఎటాక్‌ చేయలేకపోయారు. టీడీపీ ముఖ్య నేతలను ఇళ్లకు పరిమితం చేయడంతో పోలింగ్‌ కేంద్రం దగ్గరకు చేరుకున్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు. దొంగ ఓటర్లు దండుగా దిగి పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడుతున్నా ఎదుర్కొనేవారు పది మందికి మించి కనపబడలేదు. దొంగ ఓటర్లను అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారికి అండగా నిలబడేవారూ లేకుండాపోయారు. వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడే అవకాశం ఉంది. కానీ.. టీడీపీ నేతలు వినియోగించుకోలేకపోవడంతో టౌన్‌బ్యాంకు అధికార వైసీపీ ఖాతాలో పడింది.


వాస్తవానికి..

వాస్తవానికి తిరుపతి నగరంలో టీడీపీ మంచి పట్టుంది. దీనికి తోడు అధికార వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ రెండింటిని టీడీపీ నేతలు అందుకోలేకపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. తిరుపతి నగరంలో మొత్తం 50 డివిజన్లు వున్నాయి. ప్రతి డివిజన్‌ నుంచీ కనీసం 10 మంది కార్యకర్తలు హాజరైనా 500 మందితో పార్టీ కార్యక్రమాలు బ్రహ్మాండంగా విజయవంతమవుతాయి. కానీ.. పార్టీ పిలుపు ఇచ్చిన ఏ ప్రోగ్రామ్‌లోనూ 50 మంది కూడా కనిపించడం లేదు. గతేడాది మార్చిలో జరిగిన తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓ సాధారణ మహిళా కార్యకర్త చూపిన తెగువను కూడా పార్టీలో మిగిలినవారు కొనసాగించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 7వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌గా బరిలో దిగిన ఎం.విజయలక్ష్మి తెగువతో.. అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి ఎన్నికల అధికారుల వరకూ హడలిపోయారు. ఫోర్జరీ సంతకంపై కమిషనరే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్ళారు. ఫలితంగా ఆ డివిజన్‌లో ఎన్నికలు అప్పట్లో ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితులను టీడీపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నారని టౌన్‌ బ్యాంకు ఎన్నికలు నిరూపిస్తున్నాయి.


వైసీపీ అధికారంలోకి వచ్చాక...

ఇదిలావుంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. తిరుపతితోపాటు పరిసర ప్రాంతాల్లో జరగని అక్రమం లేదు. భూ కబ్జాల దగ్గర నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సెటిల్‌మెంట్లు, ఇసుక అక్రమ దందా వరకూ సవాలక్ష సమస్యలతో నగర వాసులు, పరిసర ప్రాంత ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ దందాల్లో స్థానిక అధికార పార్టీ నేతల పాత్ర ఉందని తెలిసినా వారిని ఎండగట్టడంలో టీడీపీ నేతలు శ్రద్ధ చూపడంలేదు. వైసీపీ ఆగడాల మీద దృష్టి పెట్టాల్సిన టీడీపీ నేతలు వారి పేర్లు కూడా ప్రస్తావించలేకపోతున్నారు. తిరుపతిలో 1983 నుంచి ఇప్పటి వరకూ 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 6 సార్లు టీడీపీ విజయం సాధించింది. నగర ఓటర్లు, విద్యావంతులు అధికంగా ఉండడంతోపాటు తొలి నుంచీ టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది. ఇలాంటి చోట అనైక్యత, సమన్వయలోపం, ఆర్ధిక వనరుల లేమి వంటి సమస్యలు టీడీపీని బలహీనపరుస్తున్నాయని తెలుస్తోంది. ఈ కారణంగానే తిరుపతిలో టీడీపీ ఓటమిని మూటగట్టుకుంటోందంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఇప్పటికైనా.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chadrababu) ప్రత్యేక దృష్టి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు.

Updated Date - 2022-07-28T00:57:29+05:30 IST