Tirupati: రేపు తిరుపతిలో ‘జనవాణి’ విననున్న పవన్‌

ABN , First Publish Date - 2022-08-21T02:24:36+05:30 IST

రాయలసీమ, నెల్లూరు జిల్లాల స్థాయిలో జనసేన పార్టీ తిరుపతి (Tirupati)లో ఆదివారం జనవాణి కార్యక్రమం నిర్వహించనుంది.

Tirupati: రేపు తిరుపతిలో ‘జనవాణి’ విననున్న పవన్‌

తిరుపతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల స్థాయిలో జనసేన పార్టీ తిరుపతి (Tirupati)లో ఆదివారం జనవాణి కార్యక్రమం నిర్వహించనుంది. కొంతకాలంగా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనవాణి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాధిత ప్రజల నుంచీ స్వయంగా పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) అర్జీలు స్వీకరించడమే కాకుండా వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో రెండు సార్లు, అలాగే భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహించిన జనసేన తాజాగా నాలుగో కార్యక్రమాన్ని తిరుపతిలో చేపట్టనుంది. తిరుపతి నగరం బాలాజీ డెయిరీ సమీపంలోని జీఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకూ కార్యక్రమం కొనసాగనుంది. శనివారం కడప జిల్లా (Kadapa District)లో పర్యటించిన పవన్‌ కళ్యాణ్‌ అర్ధరాత్రికి తిరుపతికి చేరుకుని తాజ్‌ హోటల్లో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం జీఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలుకు చేరుకుని జనవాణిలో ప్రజల నుంచీ అర్జీలు స్వీకరించనున్నారు. ఆయన వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొననున్నారు.


కాగా రాయలసీమ (Rayalaseema) పరిధిలోని కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలోని బాధిత ప్రజల నుంచీ అర్జీలు స్వీకరించనున్నారు. తొమ్మిది జిల్లాల పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో జనసేన పార్టీ యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతానికి కృషి చేస్తోంది. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌కు తమ సమస్యలపై అర్జీలు ఇస్తే సమస్యలు హైలైట్‌ కావడంతో పాటు ప్రభుత్వం దృష్టికి వెళుతుందని, అనివార్యంగా ప్రభుత్వంపై తలెత్తే ఒత్తిడి వల్ల తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో బాధితులు జనవాణి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2022-08-21T02:24:36+05:30 IST