Tirumala: టీటీడీలో ఇంటి దొంగ గుట్టురట్టు.. పోలీసులు ఎవరిని, ఎందుకు అరెస్ట్ చేశారో చూడండి..

ABN , First Publish Date - 2022-08-13T03:07:23+05:30 IST

టీటీడీ ఇంటిదొంగ గుట్టు రట్టయింది. టీటీడీ సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా..

Tirumala: టీటీడీలో ఇంటి దొంగ గుట్టురట్టు.. పోలీసులు ఎవరిని, ఎందుకు అరెస్ట్ చేశారో చూడండి..

తిరుమల: టీటీడీ ఇంటిదొంగ గుట్టు రట్టయింది. టీటీడీ సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను బ్లాక్‌లో అధిక ధరలకు మల్లికార్జున్‌ విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో సూపరింటెండెంట్‌తో పాటు ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేశారు. శ్రీవారి దర్శన టికెట్ల బ్లాక్‌ విక్రయాలపై పోలీసులు విచారణ చేయగా.. మరి కొంతమంది ఇంటిదొంగల బాగోతం బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వేచి ఉన్న క్రమంలో అక్కడి సిబ్బంది డబ్బులు తీసుకుని తమకంటే వెనుకవచ్చిన వారిని ముందున్న కంపార్టుమెంట్‌లో కూర్చోబెట్టారు.


తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కూడా అర్చకులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవ్వకపోతే నెట్టివేస్తున్నారు. తిరుమలలో అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దర్శనం స్లాట్‌, సప్తగిరి అతిధి భవనంలో వసతి బుక్‌ చేసుకున్నాం. గది ఖాళీ చేసేటప్పుడు అక్కడున్న సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇలాంటి అవినీతిని అరికట్టండి’ అంటూ పలువురు భక్తులు తిరుమలలో గురువారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.



ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ..వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో డబ్బులు తీసుకుని దర్శనానికి పంపిన ఘటనపై సీసీ కెమెరాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని, టీటీడీ ఆలయాల్లో అర్చకులెవరైనా అడిగితే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. టీటీడీ ఉద్యోగులకు భక్తులతో ప్రవర్తించే విధానంపై శ్వేతలో ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. తిరుమలలో మరిన్ని ప్రదేశాల్లో కల్యాణకట్టలు ఏర్పాటు చేయాలని కోరగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల కాటేజీల్లో వేడినీళ్లు రావడం లేదని తెలుపగా, సెప్టెంబరు నాటికి అన్ని వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుచానూరు ఆలయంలో భద్రతా సిబ్బంది ప్రవర్తన బాగాలేదని ఫిర్యాదు చేయగా, తగిన చర్యలు తీసుకోమని సీవీఎస్వోను ఆదేశిస్తామన్నారు. దాతలు దర్శనానికి రాకపోయినప్పటికీ వారికిచ్చే లడ్డూలు, వస్త్రం, బంగారు డాలర్‌ షరతులు లేకుండా అందించాలని కోరగా అందిస్తామని ఈవో సమాధానమిచ్చారు. 2004లో శ్రీవారి అభిషేక సేవకు డబ్బులు కడితే 2021కి వచ్చిందని, కరోనా కారణంగా దాన్ని రద్దు చేశారని, తిరిగి అభిషేకం టికెట్‌ ఇవ్వాలని ఓ భక్తుడు కోరగా ఈవో స్పందిస్తూ శ్రీవారి అభిషేక టికెట్లు 2050 వరకు భక్తులు బుక్‌ చేసుకున్నారని, తిరుమలలో లక్కీడిప్‌ ద్వారా రోజూ 10 టికెట్లను కేటాయిస్తారని, గురువారం రిజిస్టర్‌ చేసుకుని టికెట్లు పొందవచ్చని తెలిపారు.

Updated Date - 2022-08-13T03:07:23+05:30 IST