tirumala: శ్రీవారిబ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

ABN , First Publish Date - 2022-09-27T02:13:50+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది.

tirumala: శ్రీవారిబ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడాన్ని అంకురార్పణం అంటారు. విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల మధ్య ఊరేగింపుగా మాడవీధిలో ఉత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తరువాత యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు. లలాట, బహు, సప్త పునీత ప్రదేశంలో భూమిపూజ జరిపారు. తొమ్మిది కుండల్లో శాలి, వ్రహి, యువ, ముద్గ, మాష, ప్రియంగు వంటి నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మొలకెత్తించే పనికి శ్రీకారం చుట్టారు.వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజవాపం కార్యక్రమంతో అంకురార్పణ కార్యక్రమం సమాప్తమైంది. క్రమం తప్పకుండా నీరు పోస్తూ పచ్చగా మొలకెత్తేలా అర్చకులు జాగ్రత్తగా చూసుకుంటారు. మంగళవారం సాయంత్రం జరిగే ధ్వజరోహణంతో గోవిందుడి బ్రహ్మోత్సవాల సంబరం మొదలుకానుంది. 


తిరుమల ఆలయంలోని ధ్వజస్తంభానికి గరుడ ధ్వజపటాన్ని అధిష్టింపచేసి సకలదేవతలను ఆహ్వానించడమే ధ్వజారోహణ మహోత్సవం.ధ్వజారోహణాన్ని పురస్కరించుకుని దేవేరులతో కూడిన మలయప్పకు ఉదయం బంగారువాకిలిలో విశేష సమర్పణ చేస్తారు. సాయంత్రం యాగశాలలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలనంతరం తిరుచ్చిలో ఉత్సవర్లతో పాటు అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి, ధ్వజపటం తదితరాలను మధ్యాహ్నం 3-5గంటల మధ్య నాలుగుమాడ వీధులలో ప్రదక్షిణగా ఊరేగించి ఆలయానికి తీసుకొస్తారు. సాయంత్రం 5.45 - 6.15 గంటల మధ్య మీనలగ్నం ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. రాత్రి 9-11 గంటల నడుమ జరిగే పెద్దశేషవాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ మంగళవారం రాత్రి శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.బ్రహ్మోత్సవాల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. కేవలం సర్వదర్శనాలను మాత్రమే అమలుచేయనుంది. 



Updated Date - 2022-09-27T02:13:50+05:30 IST