ఆ కాపులు జగన్‌ పాలేర్లు

ABN , First Publish Date - 2022-11-03T04:24:38+05:30 IST

వైసీపీలో కాపు నేతలు సీఎం జగన్మోహన్‌రెడ్డికి పాలేరుల్లా వ్యవహరిస్తున్నారని జనసేన కాపు నేతలు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతలు బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఆ కాపులు జగన్‌ పాలేర్లు

అది వైసీపీ కుల సమావేశం.. రంగా హత్యపై రాజకీయం

తప్పుడు కూతలకే చెప్పులు చూపించాం.. జనసేన కాపు నేతల ఫైర్‌

తాడేపల్లిగూడెం అర్బన్‌, నవంబరు 2: వైసీపీలో కాపు నేతలు సీఎం జగన్మోహన్‌రెడ్డికి పాలేరుల్లా వ్యవహరిస్తున్నారని జనసేన కాపు నేతలు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతలు బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కాపు నేతలు హాజరయ్యారు. రాజమండ్రిలో వైసీపీ కాపు నేతలు చేసిన వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రాజమండ్రిలో వైసీపీ నాయకులు జరిపింది కాపు కుల సమావేశం కాదు... వైసీపీ కుల సమావేశం. పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఉపేక్షించేది లేదు. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు నిజమైన కాపు బిడ్డలైతే జనసేనలోకి వచ్చి కాపుల ఎదుగుదలకు కృషి చేయాలి. తప్పుడు కూతలు కూస్తున్నారు కాబట్టే చెప్పులు చూపించాల్సి వచ్చింది. విశాఖలో పవన్‌ కల్యాణ్‌ను నిలువరిస్తామని వైసీపీ ప్రగ ల్భాలు పలికింది. దీనిని నిరోధించడానికే జన సైనికులు, వీర మహిళలు ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాపు నాయకులను గౌరవంగా చూసేవారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వంగవీటి రంగా హత్యను రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. రంగాపై అంత ప్రేమే ఉంటే ఆయన తనయుడు రాధాకు వైసీపీలో టికెట్‌ ఎందుకు ఇవ్వలేదు? జనసేన, టీడీపీ కలుస్తారంటూ కావాలనే వైసీపీ నేతలు బురద చల్లుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ సీఎం కావడం తథ్యం’’ అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య అన్నారు. కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన జనసేన కాపు నేతలు, కాపు సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T04:24:38+05:30 IST
Read more