టెన్త్‌ తన్నేసింది

ABN , First Publish Date - 2022-06-07T09:17:06+05:30 IST

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది.

టెన్త్‌ తన్నేసింది

  • సమైక్యాంధ్రలో చూసినా ఇదే అత్యల్ప ఉత్తీర్ణత
  • 2014-2019 వరకు దాదాపు 94ు పాస్‌
  • ఉమ్మడి ఏపీలో కూడా 83 నుంచి 88 శాతం
  • ఈసారి 67.26 శాతం మాత్రమే
  • దెబ్బతీసిన కొవిడ్‌, సర్కారు నిర్లక్ష్యం
  • టెన్త్‌ పేపర్‌ మోడల్‌ మార్చడం, టీచర్ల కొరత,
  • యాప్‌ల భారమూ పతనానికి కారణాలే


అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో  రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ ఉత్తీర్ణత  శాతం నమోదైంది.  2020, 2021లో కొవిడ్‌ కారణంగా పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. 2019లో జరిగిన పరీక్షల్లో 94.80శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు అది దాదాపు 17.5శాతం తగ్గిపోయి... 67.26 శాతంగా నమోదైంది. సమైక్యాంధ్ర చరిత్రలోనూ ఇదే అతి తక్కువ  పాస్‌ పర్సంటేజీ. కొవిడ్‌ కారణంగానే ఫలితాలు ఇలా వచ్చాయని ప్రభుత్వం చెప్తోంది. సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. కొవిడ్‌ వల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందని చెప్పారు. కొవిడ్‌ పరిస్థితులు కచ్చితంగా కొంత కారణమే. అందులో అనుమానం లేదు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్‌లైన్‌ తరగతులు జరిగాయి. వాటిని విద్యార్థులు సరిగా అర్థం చేసుకోలేకపోవడం, కొందరికి ఆన్‌లైన్‌లో వినే వెసులుబాటే లేకపోవడం, అదేవిధంగా తరగతులు వింటున్నట్లు నటిస్తూ...ఫోన్‌లలో ఇతరత్రా వీడియోలు చూడడం లాంటివి కొంత జరిగాయి. అయితే ఈ విద్యాసంవత్సరం బాగానే తరగతులు జరిగాయి. రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన పాఠశాలలు ఆగస్టునుంచి పరీక్షలు జరిగిన నెల వరకు నిరాటంకంగా కొనసాగాయి. కొవిడ్‌ గత రెండేళ్లుగా ఉన్నా ఈ ఏడాది మాత్రం తరగతులు నిర్వహించారు. 


అదేవిధంగా కొంత సిలబస్‌ కూడా తగ్గించారు. అందువల్ల పూర్తినెపం కొవిడ్‌ మీదకే నెట్టేయడం కచ్చితంగా సరైంది కాదని విద్యానిపుణులు అంటున్నారు. ప్రభుత్వం పదో తరగతి విద్యపై సరైన దృష్టి సారించలేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పుకొంటూ వెళ్లడమే కాదు...వారిలో ఎవరు వెనకబడ్డారు? ఎవరు బాగా చదవడం లేదు అన్నది ఉపాధ్యాయులు గమనించాలి. వారిపై ప్రత్యేకదృష్టి పెట్టాలి. ఆ పని సహజంగా ప్రధానోపాధ్యాయుడు చేయాలి. ఆయన తన పర్యవేక్షణలో ఈ విషయాలను గమనించి... వాటిని అధిగమించేందుకు, విద్యార్థులందరినీ మెరుగుపర్చేందుకు తరగతి ఉపాధ్యాయులకు తగిన సూచనలివ్వాలి. కానీ అసలు ప్రధానోపాధ్యాయుడిని ఈ పనే చేయనివ్వలేదు. ఆయనకు మరుగుదొడ్ల శుభ్రత, మరుగుదొడ్లు ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనం ఫొటోలు తీయడం, హాజరు ఫొటో తీయడం...ఇలాంటి పలు యాప్‌లతోనే సరిపోయింది. ఇక విద్యార్థుల అభ్యసన, వారి మార్కులపై దృష్టిపెట్టే సమయమే లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఉపాధ్యాయుల కొరత కూడా కొంత కారణమే. వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలున్నా ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో ఉన్నత తరగతుల్లో సరిపడా సబె ్జక్టు ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇది బోధనపైనా ప్రభావం చూపిందంటున్నారు. కొవిడ్‌ పరిస్థితుల అనంతరం ప్రారంభమైన విద్యాసంవత్సరంలో కీలకమైన పదో తరగతి విద్యార్థులపై ప్రభుత్వం పెట్టాల్సినంతగా దృష్టి పెట్టలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 


చాయిస్‌కు కత్తెర..

పేపర్‌ మోడల్‌ మార్చడం కూడా ఒక కారణమే అని అంటున్నారు. గతంలో నాలుగు ప్రశ్నలిచ్చి...లేదంటే ఐదు ప్రశ్నలిచ్చి అందులో రెండు రాస్తే చాలు అనే పద్ధతి ఉండేది. ఈసారి ఇలాంటి చాయిస్‌ తీసేశారు. కేవలం రెండు ప్రశ్నలిచ్చి ఆ రెండింటిలో ఒకటి రాయాలనే పద్ధతి పెట్టారు. ఇదీ లేదా అదీ అన్న పద్ధతిలో ప్రశ్నలు ఇచ్చారు. ఇది చాయి్‌సను సగం తగ్గించడమేనంటున్నారు. మరోవైపు చిన్న ప్రశ్నలకు అసలు చాయిస్‌ లేకుండా తీసేశారు. ఇది కూడా పాస్‌ పర్సంటేజి తగ్గేందుకు కారణమైందని విద్యా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Read more