ఇసుకను దోచేస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-12T02:17:21+05:30 IST

టీడీపీ హయాంలో ఇసుకను దోచేశారు. అందుకే ఇసుక సరఫరాలో సంస్కరణలు తెస్తాం. ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటనివ్వం.

ఇసుకను దోచేస్తున్నారు

సరిహద్దులు దాటించి కోట్లలో అక్రమార్జన

అధికార పార్టీ నేతలే సూత్రధారులు

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు రోజూ 200 లారీలు

నెలకు నేతల జేబుల్లోకి 100 కోట్ల సొమ్ము

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

‘టీడీపీ హయాంలో ఇసుకను దోచేశారు. అందుకే ఇసుక సరఫరాలో సంస్కరణలు తెస్తాం. ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటనివ్వం. ఎవరైనా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’... అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ ఇసుక తవ్వకాలపై చేసిన వ్యాఖ్యలివి. మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇసుక సామాన్యుడికి చుక్కలు చూపిస్తూనే ఉంది. అధికార పార్టీ నాయకులే ఇసుక దోపిడీకి తెరదీసి సరిహద్దులు దాటించేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నిత్యం రూ.కోటి విలువైన ఇసుక తెలంగాణకు తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో చేష్టలుడిగి చూస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇసుక బంగారమైపోయింది. గతంలో లారీ ఇసుక రూ.8 వేల లోపు ఉంటే... ప్రస్తుతం రూ.35 వేల పైచిలుకు పలుకుతోంది. ఇసుక రీచ్‌ల వద్ద టన్ను ఇసుక గరిష్ఠంగా రూ.475కు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రతివారం పత్రికల్లో ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్నా... ఆచరణలో ఆ ధరకు దొరకడం అసాధ్యం. ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లాలో రీచ్‌లను ఓ వైసీపీ నేత దక్కించుకున్నారు. తెరవెనుక బడా వైసీపీ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.

రాత్రివేళ సరిహద్దు దాటించి...

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నిత్యం 200 పైచిలుకు లారీలు గరికపాడు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును దాటి వెళ్తున్నాయి. జిల్లాలోని పలు రీచ్‌ల్లో లోడ్‌ చేసుకున్న లారీలన్నింటినీ జగ్గయ్యపేట ఆటోనగర్‌లో, జాతీయ రహదారి వెంబడి నిలిపి ఉంచుతున్నారు. చీకటి పడిన వెంటనే లారీలన్నీ వరుసగా గరికపాడు చెక్‌పోస్టుకు క్యూ కడుతున్నాయి. ఒక్కోలారీలో 45 టన్నుల వరకు ఇసుక లోడ్‌ చేస్తున్నారు. తెలంగాణలో లారీ ఇసుక రూ.50 వేలు పైచిలుకు పలుకుతోంది. ఈ లారీలన్నీ టీఎస్‌ రిజిస్ట్రేషన్‌ నంబరుతోనే ఉంటున్నాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన లారీలు అధికలోడుతో ఇసుకను తరలించుకుపోతున్నా ఏపీ పోలీసులు కానీ రవాణా శాఖ అధికారులు కానీ వాటి వైపే చూడటం లేదు.

నిత్యం సరిహద్దులు దాటుతున్న ఇసుక విలువ రోజుకు రూ.కోటి పైనే ఉంటుంది. నెల తిరిగేసరికి వైసీపీ నేతలు రూ.30 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది కేవలం సరిహద్దులు దాటే ఇసుక ద్వారా వచ్చేది మాత్రమే. స్థానికంగా ఇష్టారాజ్యంగా విక్రయం ద్వారా అంతకు రెట్టింపు సొమ్మును వైసీపీ నేతలు జేబుల్లో వేసుకుంటున్నారు. మొత్తమ్మీద నెల తిరిగేసరికి ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలకు ఇసుక ద్వారా రూ.100 కోట్లు వరకు వస్తోందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో అందుబాటేదీ?

గతంలో ఆన్‌లైన్‌లో దొరికే ఇసుక... ఇప్పుడసలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో భవన నిర్మాణదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు డిమాండ్‌ను బట్టి టన్ను ఇసుకను రూ.1200 నుంచి 1300 వరకు విక్రయిస్తున్నారు.

Updated Date - 2022-12-12T02:26:40+05:30 IST