ఆర్థిక ఆరోగ్యానికి ఢోకా లేదు

ABN , First Publish Date - 2022-09-17T10:15:56+05:30 IST

ఆర్థిక ఆరోగ్యానికి ఢోకా లేదు

ఆర్థిక ఆరోగ్యానికి ఢోకా లేదు

రాష్ట్ర జీడీపీ 11.43శాతం.. దేశంలోనే ఫస్టు

కేంద్రం కంటే కూడా భేష్‌.. అప్పులపై దుష్ప్రచారం

టీడీపీ ఐదేళ్లలో తెచ్చిన అప్పు 3.28 లక్షల కోట్లు

మేం మూడేళ్లలో రూ.1,17,730 కోట్లే చేశాం: సీఎం

డబ్బులు రాకుండా కేంద్రానికి లేఖలు రాస్తున్నారు

అసెంబ్లీలో సీఎం జగన్‌ వెల్లడి


అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు.. ఆర్థిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు. ఆరోగ్యపరంగా చంద్రబాబుకు ఇబ్బందులున్నాయి గానీ రాష్ట్రం పరిస్థితి బాగానే ఉంది. దీనిని చంద్రబాబు, ఆయన మీడియా జీర్ణించుకోలేకపోతున్నారు’ అని సీఎం జగన్‌ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో పరిశ్రమలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితి, అప్పులపై ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కు అందించే సంక్షేమ, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు రాకుండా ఆపేయాలన్న ఉద్దేశంతో కేంద్రానికి, జాతీయ బ్యాం కులు, ఆర్థిక సంస్థలకు తప్పుడు ఉత్తరాలు రాస్తున్నారని ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేసి మరీ పేదలకు ఇచ్చే స్కీమ్‌ల ను ఆపేయడానికి వీరు పెద్ద స్కీమ్‌గా పెట్టుకున్నారని, ఇందుకోసం రాత్రిపగలు కష్టపడుతున్నారని ఆరోపించారు. ఏపీలో ఆర్థిక వ్యవస్థని గత ప్రభుత్వం కంటే, దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐదు కోట్ల మంది ఇంటింటి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి చేస్తూనే 98.4 శాతం హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. ‘దోచు కో... పంచుకో.. తీసుకో అన్న దొంగల ముఠా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు తోడు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంగా బాగున్నా, బాగోలేదని.. రాష్ట్రం శ్రీలంక అయిపోయిం ది.. అయిపోతుందని ప్రజల మనసుల్లో ఒక ముద్ర సృష్టిస్తున్నారు. గత ప్రభుత్వం చేయలేదు.. దేవుడి దయతో మనం చేస్తున్నాం కాబట్టి వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో 2018-19లో రాష్ట్ర జీడీపీ 5.36ు ఉండడంతో పాటు దేశంలో 21వ స్థానంలో ఉండేదని.. 2019-20లో తామొచ్చాక జీడీపీ 6.89ుకి పెరిగిందని.. జాతీ య స్థాయిలో 6వ స్థానానికి ఎగబాకిందని చెప్పారు. ‘2021- 22లో రాష్ట్ర జీడీపీ రేటు 11.43ుకి పెరిగింది. దేశంలో రాష్ట్రాలతో పోల్చితే మొదటి స్థానంలో ఉన్నాం. 2014-19 మధ్య దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ 4.45ు ఉంటే.. 2019-22 మధ్య 5ుకి పెరిగింది’ అని వివరించారు. కొవిడ్‌ విలయంతో ప్రపంచ స్థూల ఉత్పత్తి తగ్గిపోయిందని, జీడీపీతో పాటు తలసరి ఆదా యం కూడా పూర్తిగా తగ్గిపోయిందన్నారు. అయితే దేశంలో మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో మాత్రమే పాజిటివ్‌ జీడీపీ కనిపించిందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..


టీడీపీయే అప్పులు పెంచింది!

మా ప్రభుత్వం అసాధారణ అప్పులు చేస్తోంది.. ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో కూరుకుపోయింది.. ఇప్పుడప్పుడే బయటపడే పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు. 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చే వరకూ ఏపీ అప్పులు రూ.1,20,556 కోట్లు మా త్రమే. 2019 మే నాటికి రూ.2,69,462 కోట్లకు పెరిగింది. అంటే 123.52 శాతం అధికంగా తెచ్చింది. 2019 మే తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మేం కేవలం 41.83 శాతం మాత్రమే చేశాం. మూడేళ్ల కాలంలో 1,17,730 కోట్లే తెచ్చాం. ఈ ఏడాది మార్చి నాటికి అప్పులు రూ.3,82,165 కోట్లకు చేరాయి. ప్రభుత్వ గ్యారెంటీ రుణాలను కూడా గత ప్రభుత్వం భారీగా పెంచేసింది. 2014 వరకూ ప్రభుత్వ సం స్థల ద్వారా తెచ్చిన అప్పులు కేవలం రూ.14,028 కోట్లు. 2019 నాటికి ఆ లెక్క రూ.59,257 కోట్లకు పెరిగింది. మొత్తంగా ఇప్పటి వరకూ రాష్ట్రం అప్పులు రూ.4,99,.895 కోట్లు ఉన్నాయి. ఇదంతా కాగ్‌ రిపోర్టుల ఆధారంగానే చెబుతున్నాం. రాష్ట్ర ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు రాకుండా ఆపేయాలన్న ఉద్దేశంతో కేంద్రానికి, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తప్పుడు ఉత్తరాలు రాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ జీడీపీతో పోల్చితే ఏపీ జీడీపీ చాలా బాగుంది. 2014-15లో కేంద్రం రూ.62.42 లక్షల కోట్లు అప్పులు చేసింది. అది 2020-21లో రూ.120 లక్షల కోట్లకు పెరిగింది. 2021-22లో కూడా రూ.135 లక్షల కోట్లు కేంద్రం అప్పుగా తెచ్చింది. దాని కంటే ఏపీ అప్పులు భారీగా తగ్గాయి. 2014-19 మధ్య రాష్ట్రానికి కరోనా లాంటి ప్రత్యేకమైన సమస్యలు లేవు. అయినా చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. రాష్ట్రం ఎవరి హయాంలో గాడి తప్పిందో ప్రజలు తెలుసుకోవాలి.


ఎక్కువ చెల్లింపులు చేసింది మేమే..

తీసుకొచ్చిన అప్పులకు చెల్లింపులు ఎక్కువగా చేసింది మే మే. ఈ చెల్లింపుల వల్ల మోయలేని భారం పడుతోందని.. పన్నుల భారం మొత్తం రుణాల చెల్లింపులకే సరిపోతోందని చంద్రబాబు అంటున్నారు. 2014-19 మధ్య కాలంలో తీసుకొచ్చిన రుణాలకు కట్టిన వడ్డీలు రూ.15,342 కోట్లు. అసలు కట్టింది రూ.13,545 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కింద రూ.21 వేల కోట్లు, అసలు కింద రూ.14 వేల కోట్లు.. మొత్తంగా 35 వేల కోట్లు చెల్లించాం. రుణాలకు కట్టాల్సిన వడ్డీలు, అసలు కలిపి 47.06ు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొవిడ్‌ లేకుంటే అది 45ుకి తగ్గిపోయేది. సంపద సృష్టించడం లేదని.. ప్రజాకర్షక పథకాలకు ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నామన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇది అవాస్తవం. మూడేళ్ల కాలంలో అత్యధిక మొత్తాన్ని మూలధన వ్యయం కింద ఖర్చు చేశాం. గత ప్రభుత్వం మూలధన వ్యయం కింద 76,135 కోట్లు ఖర్చు చేస్తే.. మేం 55,080 కోట్లు ఖర్చు చేశాం. విద్యా, వైద్య, వ్యవసాయం రంగాలకు అధికంగా ఖర్చు పెడుతున్నాం. 


కేంద్రం నిధులివ్వడం లేదు

కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాలను సక్రమం గా ఇవ్వడం లేదు. 14వ ఆర్థిక సంఘం 2015-20 మధ్యలో సెస్‌, సర్‌చార్జీలు మినహా రాష్ట్రాలకు 42ు పన్నుల వాటా ఇవ్వాలని సూచించింది. 15వ ఆర్థిక సంఘం 41ు ఇవ్వాలని చెప్పింది. కేంద్రం ఏనాడూ ఆర్థిక సంఘం సూచనలు పాటించలేదు. 2019 నుంచి పన్నుల వాటాను పూర్తిగా తగ్గించింది. 2019-20లో 32.41ు, 20-21లో 29.35ు, 21-22లో 32.56ు, ఈ ఏడాది ఇప్పటి వరకూ 23.13 శాతం మాత్రమే పన్నుల వాటా కింద ఇచ్చింది. గత ప్రభుత్వంలో కూడా తక్కువ వాటా ఇచ్చినా.. 30 శాతం తగ్గకుండా ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన ఆదాయం తగ్గినప్పటికీ దేవుడి దయ వల్ల లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా సంక్షేమ ఫలాలను ఇస్తున్నాం. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది బోరింగ్‌ సబ్జెక్టు అయినా నెగటివ్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నారు కాబట్టే ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో వివరంగా చెప్పాల్సి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.2.28 లక్షల కోట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. పెద్దగా మార్పు లేదు. కానీ మా ప్రభుత్వం అమ్మఒడి, చేయూత, అసరా, పెన్షన్లు, రైతుభరోసా లాంటి పథకాలు ఇస్తూ మూలధన వ్యయం ఎక్కువ చేస్తోంది. మరి గత ప్రభుత్వం ఎందుకీ పథకాలు అమలు చేయలేకపోయింది? 


99 భారీ పరిశ్రమలు తెచ్చాం..

అంతకు ముందు పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకూ 99 భారీ పరిశ్రమలను తీసుకొచ్చిందని.. 46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మొత్తంగా 2,11 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా పారిశ్రామికాభివృద్ధిపై ప్రసంగించారు.

Read more