-
-
Home » Andhra Pradesh » The YCP leader slogan is not to have three capitals-MRGS-AndhraPradesh
-
మూడు రాజధానులు వద్దంటూ వైసీపీ నేత నినాదం
ABN , First Publish Date - 2022-10-05T23:56:49+05:30 IST
మూడు రాజధానులు వద్దంటూ వైసీపీ నేత నినాదం

ద్వారకాతిరుమల, ఏలూరు: మూడు రాజధానులు వద్దంటూ ఓ వైసీపీ నేత చేసిన నినాదం చర్చనీయాంసంగా మారింది. ఈ దృశ్యం చూస్తే అసలు నిజంగా వైసీపీ నేతలు మూడు రాజధానులు కోరుకుంటున్నారా.. అనే సందేహం వ్యక్తం అవుతుంది. బలవంతంగా వైసీపీ నేతలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు, పూజలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓకే రాజధాని ఒకే రాష్ట్రం పేరుతో అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్రకు ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మనసును మరల్చే విధంగా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ మూడు రాజధానులు అంశం లేవనెత్తింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా రాష్ట్రంలో ప్రతి వైసీపీ నాయకుడు మూడు రాజధానులకు మద్దతుగా స్థానిక నాయకులను కూడగట్టుకుని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వానికి తెలియని అసలు నిజం ఒకటి ఉంది. ఈ దృశ్యం చూస్తే వైసీపీ నాయకులు కూడా మూడు రాజధానులకు ఇష్టపడటం లేదనే వాస్తవం తెలుస్తోంది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు ఆధ్వర్యంలో మూడు రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా చిన వెంకన్న పాదాల చెంత 101 కొబ్బరికాయ కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓ వైసీపీ నేత మూడు రాజధానులు వద్దు అంటూ నినాదాలు చేశాడు. దీంతో ఎమ్మెల్యేతో సహా పక్కనున్న వైసీపీ నేతలు కంగుతిన్నారు. వెంటనే ఆ నేతకు మన నినాదం ఒక రాజధాని వద్దు, మూడు రాజధాని ముద్దు అని చెప్పి సరి చేశారు. అయితే వాస్తవానికి వైసీపీ నాయకుల మనసులో కూడా మూడు రాజధానులు వద్దనే విషయం బలంగా నాటుకు పోవడంతోనే ఆ నినాదం వచ్చి ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.