కొత్తగా ఒరిగిందేమిటి? వచ్చిందెంత?

ABN , First Publish Date - 2022-10-03T08:23:48+05:30 IST

సంక్షేమానికి తామే చిరునామా అయినట్లు.. సంక్షేమ పథకాలపై తమదే పేటెంట్‌ అన్నట్లు..

కొత్తగా ఒరిగిందేమిటి? వచ్చిందెంత?

  • బయటపడ్డ జగన్‌ పథకాల డొల్లతనం
  • టీడీపీ హయాంలోనే కొంత ఎక్కువ ‘సంక్షేమం’
  • వైసీపీ ముద్రించిన కరపత్రమే నిదర్శనం
  • ఒక కుటుంబానికి జరిగిన లబ్ధిపై పరిశీలన
  • ఇప్పుడు సగటున ఏటా రూ.30,590 లబ్ధి
  • టీడీపీ హయాంలో రూ.33,200 ప్రయోజనం
  • మారింది... పథకాల పేరు, అమలు తీరే!
  • నేడు అనేక పథకాలు రద్దు పద్దులోకి


ఇది ఒక కుటుంబానికి చెందిన కేస్‌ స్టడీ! రాష్ట్రంలోని దాదాపు అన్ని కుటుంబాలదీ దాదాపు ఇదే పరిస్థితి! కొందరికి కొన్ని పథకాలు వర్తిస్తాయి, కొన్ని వర్తించకపోవచ్చు. ఏతావాతా... రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో జరిగిన ‘సంక్షేమమే’ ఇప్పుడూ జరుగుతోంది. కొన్ని కుటుంబాలకు అప్పుడే కొంత అదనపు లబ్ధి చేకూరింది. మరి... జగన్‌ సర్కారు వల్ల కొత్తగా జరుగుతున్నదేమిటి? 


పుట్టపర్తి/అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): సంక్షేమానికి తామే చిరునామా  అయినట్లు... సంక్షేమ పథకాలపై తమదే పేటెంట్‌ అన్నట్లు.. పదేపదే చెబుతున్న వైసీపీ సర్కారు ‘సంక్షేమ’ డొల్లతనం లెక్కలతో సహా బయటపడింది. కాదుకాదు.. టీడీపీ హయాంలో జరిగిన లబ్ధితో పోల్చితే, ఇప్పుడు అందుతున్న లబ్ధి తక్కువ అని వైసీపీ తనకు తానే ఒప్పుకొంది. ‘‘వైఎస్‌ జగన్‌ కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమమేదీ లేదు. పాత పథకాల పేర్లు మార్చి.. వాటి అమలు తీరు మార్చేశారు. మరెన్నో పథకాలను రద్దు చేశారు. ఇప్పటికంటే గతంలోనే సగటు లబ్ధిదారులకు అధిక ప్రయోజనం చేకూరింది’’ అనే వాదన అక్షరాలా నిజమని రుజువైంది. ఎలాగంటే...


కరపత్రాల సాక్షిగా.. 

‘కులం, మతం, పార్టీ, ప్రాంతం.. ఏదీ చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం’... అని జగన్‌ పదేపదే చెబుతుంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ.. ‘మీ కుటుంబానికి అందిన లబ్ధి ఇది’ అంటూ ‘గడప గడపకూ’లో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతున్నారు. లబ్ధిదారుడి పేరిటే.. జగన్‌ సంతకంతో వీటిని అందిస్తున్నారు. అలాగే.. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన శివయ్య పేరిట ఒక కరపత్రం ముద్రించారు. ఇందులో.. విద్యా దీవెన ద్వారా రూ.10 వేలు, రైతు భరోసా ద్వారా రూ.40 వేలు, పంటల బీమా ద్వారా రూ.1452, వసతి దీవెన కింద రూ.10 వేలు, రైతులకు సున్నా వడ్డీ ద్వారా రూ.4121, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ ద్వారా రూ.2,900, ఆసరా ద్వారా 22,802 లబ్ధి చేకూర్చినట్లు వైసీపీ ప్రభుత్వం తెలిపింది. వెరసి.. మొత్తంగా శివయ్య కుటుంబానికి మూడేళ్లలో వైసీపీ సర్కారు ద్వారా జరిగిన లబ్ధి 91,775 రూపాయలు! ఇది జగన్‌ సంతకంతో ప్రభుత్వమే ముద్రించిన కరపత్రం! అంటే, శివయ్య కుటుంబానికి ఏటా సగటున రూ.30,590 లబ్ధి చేకూరింది.


టీడీపీ హయాంలో..: ఈ నేపథ్యంలో టీడీపీ హయంలో శివయ్య కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల తీరును పరిశీలిస్తే.. టీడీపీ హయాంలోనే వారు అధికంగా లబ్ధి పొందారు. అప్పట్లో శివయ్య బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.50వేల రుణం తీసుకున్నారు. ఇందులో 50 శాతం రాయితీ, అంటే రూ.25 వేలు నేరుగా లబ్ధి చేకూరింది. ఇక.. పంట రుణాల మాఫీ కింద ఆయనకు రూ.37వేల అప్పు మాఫీ అయ్యింది. పంటల బీమా నష్ట పరిహారం రూ.25వేలకుపైగానే అందినట్లు శివయ్య తెలిపారు. ఇక.. డ్వాక్రా మహిళలకు ‘పసుపు - కుంకుమ’ ద్వారా శివయ్య కుటుంబానికి రూ.20వేలు నేరుగా అందాయి. అలాగే.. డ్వాక్రా సంఘాలకు వడ్డీ  రాయితీ ద్వారా మరో రూ.10వేల లబ్ధి చేకూరింది. వెరసి.. ఐదేళ్లలో రూ.1.66 లక్షలు నేరుగా శివయ్య కుటుంబానికి అందాయి. అంటే.. సగటున ఏటా రూ.33,200  లబ్ధి చేకూరినట్లు. ఇది.. ఆయన కుటుంబానికి నేరుగా కలిగిన ఆర్థిక ప్రయోజనం. 


ఇక.. శివయ్య కుటుంబానికి విద్యా దీవెన, వసతి దీవెన కింద లబ్ధి చేకూరినట్లు జగన్‌ సర్కారు చెబుతోంది. ఇవి రెండూ పేర్లు మార్చి అమలు చేస్తున్న పథకాలే! టీడీపీ హయాంలోనూ శివయ్య కుమారుడికి స్కాలర్‌షిప్‌ లభించింది. అప్పుడు అతను హాస్టల్‌లో లేనందున.. సంబంధిత లబ్ధి చేకూరలేదు. శివయ్య అంతకుముందెప్పుడో తన పొలానికి డ్రిప్‌ ఇరిగేషన్‌ పెట్టించుకున్నారు. లేనిపక్షంలో.. అప్పుడు 90 శాతం సబ్సిడీతో ఆ పథకం కూడా వర్తించేది. ఇప్పుడు ఈ పథకాన్ని జగన్‌ రద్దు చేసేశారు. ఇలాంటి పథకాలు చాలానే ఉన్నాయి.


మరి కొత్తగా చేసిందేమిటి..: ఏతావాతా చూస్తే.. వైసీపీ హయాంలోకంటే టీడీపీ హయాంలోనే సగటు లబ్ధిదారులకు ఎక్కువ ప్రయోజనం జరిగింది. పైగా.. చంద్రబాబు హయాంలో అమలైన అనేక పథకాలను జగన్‌ రద్దు చేశారు. ‘కల్యాణమస్తు’ పథకాన్ని మూడేళ్లు నిలిపి వేసి.. మూడేళ్ల తర్వాత పునరుద్ధరించారు. అది కూడా.. అనేక ఆంక్షలు, నిబంధనలతో! కులాలకు కార్పొరేషన్లు పెట్టారు తప్ప.. వాటికి ప్రత్యేకంగా అందుతున్న నిధులు నిల్‌! ‘నవరత్నాల’ నిధులనే కులాలవారీగా విభజించి, అందరికీ జరిగే లబ్ధినే ప్రత్యేకంగా ఆయా కులాల ఖాతాల్లో వేస్తున్నారు. అప్పట్లో కాలేజీల ఖాతాలో పడే ఫీజు రీయింబర్స్‌మెంటును ఇప్పుడు తల్లుల ఖాతాలో వేస్తున్నారు. స్కాలర్‌షి్‌పలు, కాస్మెటిక్‌ చార్జీలను రద్దు చేసి.. ‘వసతి దీవెన’ తీసుకొచ్చారు. ‘బటన్‌’ నొక్కుతూ వ్యక్తుల కేంద్రంగా పథకాలు అమలు చేస్తూ.. తన ఓటు బ్యాంకును సుస్థిరం చేయడమే జగన్‌ లక్ష్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని పథకాలు రద్దు చేసి, మరికొన్ని పథకాలనే పేరు మార్చి అమలు చేయడం తప్ప కొత్తగా జగన్‌ ఏం చేస్తున్నారన్నదే అసలు ప్రశ్న! పైగా.. టీడీపీ హయాంతో పోల్చితే ఇప్పుడు అప్పులు భారీగా పెరిగిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. రోడ్ల అభివృద్ధికి సెస్‌ వసూలు చేస్తున్నా.. రహదారుల స్థితి మారలేదు. పోలవరం  పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమరావతిని పూర్తిగా అటకెక్కించారు. అటు సంక్షేమమూ పెరగక, ఇటు అభివృద్ధి సాగక.. జగన్‌ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో!

Updated Date - 2022-10-03T08:23:48+05:30 IST