కొప్పరపు కవుల ప్రతిభ నిరుపమానం

ABN , First Publish Date - 2022-09-10T09:14:01+05:30 IST

కొప్పరవు కవుల ప్రతిభ నిరుపమానమని, జీవించిన 50 ఏళ్లలో 500 ఏళ్లకు సరిపడా అవధాన ప్రక్రియను అందించారని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కొనియాడారు.

కొప్పరపు కవుల ప్రతిభ నిరుపమానం

  • మాతృభాషలోనే బడి చదువు సాగాలి.. గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు
  • దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు విశాఖలో జాతీయ పురస్కార ప్రదానం

 సీతంపేట(విశాఖపట్నం), సెప్టెంబరు 9: కొప్పరవు కవుల ప్రతిభ నిరుపమానమని, జీవించిన 50 ఏళ్లలో 500 ఏళ్లకు సరిపడా అవధాన ప్రక్రియను అందించారని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కొనియాడారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం కొప్పరపు కవుల కళాపీఠం 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం సుప్రసిద్ధ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును కొప్పరపు కవుల కళాపీఠం జాతీయ ప్రతిభా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.  ప్రముఖ అవధానులు, అవధాన విద్యా వికాసానికి విశేష కృషిచేసిన ధూళిపాళ్ల మహాదేవమణికి గౌరవ సత్కారం, 2020కిగాను పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, 2021కిగాను జీఎం రామశర్మ, 2022కిగాను పద్దిపర్తి పద్మాకర్‌లకు పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కార గ్రహీత సింగీతం మాట్లాడుతూ... అత్యంత వేగంగా కొప్పరపు కవులు వాగ్గేయకారుల కోవకు చెందుతారన్నారు. ‘‘పింగళి నాగేంద్రరావు శిష్యుడిగా చిత్రరంగప్రవేశం చేశాను. నా మొదటి సినిమా ‘నీతినిజాయితీ’కి సాలూరు రాజేశ్వరరావు బాణీలను సమకూర్చారు’’ అని సింగీతం తెలిపారు. వైద్యులతో నయంకాని అనేక వ్యాధులు ప్రవచనాల వల్ల నయమవుతున్నాయని పలువురు చెబుతుంటే ఆనందంగా ఉందని గరికపాటి అన్నారు. తెలుగు భాషను బతికించుకోవడం కోసం 5వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాబోధన, పాఠ్యాంశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటా తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ ప్రియులు, కవులు, అభిమానులు పాల్గొన్నారు.

Read more