జనాగ్రహంతో రూటు మారింది

ABN , First Publish Date - 2022-08-25T08:18:41+05:30 IST

జనాగ్రహంతో రూటు మారింది

జనాగ్రహంతో రూటు మారింది

జనాగ్రహంతో.. రూటు మార్చిన సీఎం!

ఇక ‘గడప గడప’కూ అధికారులే వెళ్లాలి!

కలెక్టర్లూ పోవలసిందే.. సీఎం ఆదేశాలు

ప్రజా వ్యతిరేకత నియంత్రణకు వాళ్లను

పంపడమే మేలు.. పెద్దల మనోగతం

ఇప్పటికే ఎమ్మెల్యేల్లో పలువురు దూరం

వినోద, విహార యాత్రల్లో బిజీ

మరికొందరు సొంత వ్యాపారాల్లో!


జనం ఎదురుదాడిని పాలక పక్ష ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. రోడ్లు, పథకాల్లో కోతలపై ‘గడప గడప’నా నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. సహచర నేతలకు ఎదురైన అనుభవాలు చూసి మిగతావారు నియోజకవర్గాల్లో తిరిగేందుకు ససేమిరా అంటున్నారు. టికెట్లు రావని సీఎం జగన్‌ ఎంత బెదిరించినా పట్టించుకోవడం లేదు. దీంతో పరువు కోసమో.. సొంత గ్రాఫ్‌ పెంచుకోవడానికే ఏమో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికారులు, కలెక్టర్లు సైతం పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చేశారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల తిరుగుబాటుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూటు మార్చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, సమస్యలపై జనం నిలదీతలను, ఎదురుదాడిని తట్టుకోలేక చాలా మంది ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తుంటే.. వెళ్లిన కొద్దిమందిపైనా ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఇది ఇలాగే కొనసాగితే వ్యతిరేకత మరింత పెరుగుతుందని జగన్‌ గ్రహించారు. ఎమ్మెల్యేలను పంపడం కంటే అధికారులను పంపడం ఉత్తమమని.. దీనివల్ల తన గ్రాఫ్‌ ఇంకా పెరుగుతుందని.. ఎన్నికల్లోనూ లాభమని ఆయన అంచనా వేసినట్లు సమాచారం. దీంతో ఈ కార్యకమ్రానికి ఎమ్మెల్యేలు వద్దని.. అధికారులు వెళ్లాలని ఆదేశించారు. నిజానికి ఇందులో ఇప్పటికే వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక సకల శాఖలతో పాటు.. జిల్లా కలెక్టర్లూ పాలుపంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దీంతో అధికారపక్ష ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి వీరిలో చాలా మంది గడప గడపకు డుమ్మాకొట్టి.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి సరదాగా గడపి వస్తున్నారు. ఇంకొందరు సొంత వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు.


ఎందుకిలా..?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు చేరువ కావాలని వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం ఈ ఏడాది మార్చి నుంచి పలు వేదికలపై ఆదేశిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజాదరణ పొందితేనే టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారరు. వాళ్లు సీరియ్‌సగా తీసుకోకపోవడంతో వర్క్‌షాపు పెట్టారు. ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) సర్వేలు, సొంత సర్వేలంటూ వారి ముందు పెట్టారు. వారి గ్రాఫ్‌ పడిపోయిందని.. మళ్లీ గెలవాలంటే గడప గడపలో పాల్గొని తీరాలని స్పష్టం చేశారు. అప్పటికే కొందరిలో అభద్రతా భావం నెలకొంది. తమకు టికెట్‌ ఇచ్చే ఉద్దేశం సీఎంకు లేదని, అందుకే ఈ కార్యక్రమాన్ని సాకుగా చూపుతున్నారన్న అభిప్రాయం ఏర్పడింది. నిస్పృహతో గడప గడపకు వెళ్లడం లేదు. ఇంకొందరు మొక్కుబడిగా పాల్గొంటున్నారు. దీంతో వారిని దారికి తేవాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. 151 మంది ఎమ్మెల్యేల్లో సగం మందిని మార్చేయాలని పీకే సలహా ఇచ్చారని.. సొంత సర్వేల ప్రకారం 58-60 మందిని మార్చాలని.. ఆయా నియోజకవర్గాల్లో అదనపు ఇన్‌చార్జులను నియమించాలని సీఎం భావిస్తున్నారన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. కొన్ని చోట్ల అదనపు ఇన్‌చార్జులను నియమించారు కూడా. ఉదాహరణకు తాడికొండ స్థానానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడంతో అక్కడి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఇంటి వద్ద ధర్నా కూడా చేశారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని సుచరిత చెప్పారు. కానీ డొక్కాను తొలగించలేదు. మళ్లీ టికెట్‌ మీకే ఇస్తామని శ్రీదేవికి అధిష్ఠానం హామీ కూడా ఇవ్వలేదు. దీంతో ఆమె వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇదే తరహాలో గ్రాఫ్‌ పడిపోయిందన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అదనపు ఇన్‌చార్జులను నియమిస్తే.. మొదటికే మోసం వస్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


బటన్‌ నొక్కుడు.. వలంటీర్లు

వలంటీర్లకు పెద్దపీట వేసి తమకు ప్రజలతో సంబంధాల్లేకుండా చేశారని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తమ ప్రమేయం లేకుండానే పింఛన్ల పంపిణీ, పథకాల లబ్ధిదారుల ఎంపిక అంతా వలంటీర్ల ద్వారానే జరిగిపోతుండడంతో ప్రజలు తమను లక్ష్యపెట్టడం లేదని వారు అంటున్నారు. పైగా సీఎం జగన్‌ వివిధ పథకాలకు సంబంధించి బటన్‌ నొక్కి నగదును లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారని.. వారంతా మళ్లీ ఓటేస్తారని.. రెండోసారి కూడా గెలిచేస్తామని అధిక శాతం ఎమ్మెల్యేల్లో ధీమా ఉండేది. అయితే అభివృద్ధి చేయకుండా ఎంత పంచినా లాభం లేదని వారికి గడప గడపకు కార్యక్రమంతో అర్థమైంది. అధిక ధరలు, పన్నుపోటుపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఒక్కసారిగా బయటకు వస్తోందని అధిష్ఠానానికి తెలియజేశారు. కానీ ప్రభుత్వ పెద్దలు తేలిగ్గా తీసుకున్నారు. ఆ విషయం తాము చూసుకుంటామని.. గడప గడపకు వెళ్లాల్సిందేనని సీఎం చెప్పడంతో వారిలో చాలా మంది డీలా పడిపోయారు. వెళ్లినా వెళ్లకున్నా టికెట్‌ రాదని గ్రహించి దూరంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు కలెక్టర్లు, అధికారులే ఈ కార్యక్రమానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయం తమకు ఉపశమనం కలిగించినా.. దీనివల్ల నష్టం కూడా ఎక్కువేనని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్‌ స్వయంగా గడప గడపకూ వెళ్తే ఇక ప్రజాప్రతినిధులకు గౌరవం ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

Read more