ముగిసిన పీఆర్సీ డెడ్‌లైన్‌

ABN , First Publish Date - 2022-01-03T07:37:41+05:30 IST

ముగిసిన పీఆర్సీ డెడ్‌లైన్‌

ముగిసిన పీఆర్సీ డెడ్‌లైన్‌

నేటి జేఏసీల భేటీపై ఉత్కంఠ.. నోటిమాటతో ఉద్యమానికి నాడు విరామం

అప్పటినుంచి సర్కారు కాలయాపన.. మరోసారి ఆందోళనకు దిగుతారా?

లేక సర్కారీ సాగదీతకే తలొగ్గుతారా?.. 13 లక్షలమంది ఉద్యోగుల్లో ఇప్పుడిదే చర్చ


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

ఉద్యోగ సంఘాల జేఏసీలు పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగిసింది. సోమవారంలోపు ఉద్యోగ సమస్యలు పరిష్కరించకపోతే... ఆ రోజు జరిగే జేఏసీల సంయుక్త రాష్ట్ర సెక్రటరియట్‌ సమావేశంలో మరోసారి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి ఏపీజేఏసీ అమరావతి, ఏపీ జేఏసీలు అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం వారి హెచ్చరికలను లెక్కించడం లేదు. దీంతో ఉద్యోగ జేఏసీల పయనం ఎటు అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. సమస్యల సాధన కోసం ఉద్యమిస్తాయా.... లేక ప్రభుత్వం చర్చల పేరుతో జరిపే కాలయాపన, కాలక్షేప కార్యాక్రమాలకు పరిమితం అవుతాయా అనేది తేలిపోయే సమయం వచ్చేసిందని రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు నెలలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ పేరుతో మొదలు పట్టిన డ్రామాకు తెరపడలేదు. అక్టోబరు 29, నవంబరు 12, నవంబరు 20, నవంబరు 28ల్లో చర్చల పేరుతో కౌన్సిల్‌ సమావేశాలు, అధికారుల కమిటీ సమావేశాలు, సజ్జలతో సమావేశాలు అంటూ కాలయాపన చేసింది. సమస్యలు పరిష్కరించకుండా కాలక్షేపం చేస్తుండడంతో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ జేఏసీలు డిసెంబరు 7వ తేదీన ఐక్య ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టాయి. తమ హక్కుల సాధనకు లక్షలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఆర్థిక మంత్రిని రంగంలోకి దించింది. ఆర్థిక మంత్రి, సీఎ్‌స... ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, ఉద్యమాన్ని విరమించుకోవాలని, సీఎం వద్దకు రెండుమూడు రోజుల్లో తీసుకెళ్తామని, సమస్యలు పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన హామీ ఇవ్వడంతో ఉద్యోగ జేఏసీల నేతలు ఉద్యమాన్ని విరమించకుండా తాత్కాలిక విరామం ప్రకటించారు. అయితే మళ్లీ డిసెంబరు 22వ తేదీన జరిగిన సమావేశంలో సీఎస్‌ వారంలో సీఎం వద్దకు తీసుకెళ్తామంటూ  హామీ ఇచ్చారు.. ఆ హామీ నెరవేర్చలేదు. మళ్లీ డిసెంబరు 29న ఆర్థిక శాఖ అధికారులతో జరిగిన ఆరో విడత జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోనూ ప్రభుత్వం ఫిట్‌మెంట్‌పై తేల్చకుండా పిల్లిమొగ్గలేసింది. పైగా, గత ప్రభుత్వాల్లోనే ఎక్కువ జీతాలు తీసుకున్నారు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కన్నా ఎక్కువగా వేతనాలు ఉన్నాయి... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని దరిమిలా అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలోని 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు కట్టుబడాలి..అంటూ ప్రతి సమావేశంలోనూ ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగ సంఘాలు తాము అధికారుల కమిటీ సిఫారసులను ఒప్పుకునేదే లేదని తెగేసి చెప్పినా చర్చల సందర్భంగా ప్రభుత్వం పాత పాటే పదే పదే పాడుతూ వస్తోంది.


నేతలూ.. మీ దారి ఎటు?

ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగులకు నమ్మకం సడలుతోంది. ఉద్యమం ఎందుకు ప్రారంభించారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన పరిష్కారం ఇవ్వకుండానే ఎందుకు విరామం ప్రకటించారు... అనే ప్రశ్నలు వారినుంచి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జేఏసీలు సోమవారం వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించాయి. ఆ రోజు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతిల ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి ఉద్యమ కార్యాచరణ ఎలా ఉం డాలి? అనే దానిపై క్రింది స్థాయి వరకు ఉద్యోగులతో చర్చించి కార్యాచరణ రూపొందించాలనే ఆలోచనలో జేఏసీలు ఉన్నట్లు తెలిసింది.

Read more