పదిలో ఉత్తీర్ణత 67.26 శాతమే..

ABN , First Publish Date - 2022-06-07T08:57:23+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో కేవలం 67.26శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత పుష్కరకాలంలో ఇంత తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదు కాలేదు.

పదిలో ఉత్తీర్ణత  67.26 శాతమే..

  • ప్రకాశం టాప్‌... అనంత లాస్ట్‌
  • 797 పాఠశాలల్లో 100% పాస్‌
  • 71 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత
  • జూలై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ
  • ఈ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు
  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స


అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో కేవలం 67.26శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత పుష్కరకాలంలో ఇంత తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదు కాలేదు. మొత్తం 6,15,908మంది పరీక్షలకు హాజరుకాగా...4,14,281మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో బాలికలే టాప్‌. పరీక్ష రాసిన బాలికల్లో 70.70శాతం మంది ఉత్తీర్ణత సాధించగా...బాలురలో 64.02శాతం ఉత్తీర్ణత సాధించారు. 2,99,088మంది బాలికలు పరీక్ష రాయగా....అందులో 2,11,460మంది పాస్‌ అయ్యారు. 3,16,828మంది బాలురు పరీక్ష రాయగా...అందులో 2,02,821మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం 11,671పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయగా.... వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 797. ఇక జీరో శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 71. మరోవైపు అత్యధిక శాతం విద్యార్థులు పాస్‌ అయిన జిల్లా ప్రకాశం కాగా....అత్యల్ప పాస్‌ అనంతపురం జిల్లాలో నమోదైంది. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అత్యధికంగా 91.10శాతం ఉత్తీర్ణులు కాగా...ప్రభుత్వ పాఠశాలల్లో అత్యల్పంగా 50.10శాతం ఉత్తీర్ణులయ్యారు.  విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను పేర్కొంటూ మెమోరాండం ఆఫ్‌ మార్క్స్‌ సర్టిఫికెట్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో రెండురోజుల్లో పెడతారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్‌ లాగిన్‌తో లాగిన్‌ అయి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు అందిస్తారు. అదేవిధంగా విద్యార్థులు కూడా సదరు వెబ్‌సైట్‌నుంచి తమ మార్కుల మెమోను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మార్కుల మెమోలో మార్కులతోపాటు సదరు విద్యార్థి ఏ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నది కూడా పేర్కొంటారు.


ఆంగ్ల మీడియంలో అత్యధిక పాస్‌ 

ఆంగ్లమీడియంలో పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 77.55శాతం ఉత్తీర్ణత సాధించగా... తెలుగు మాధ్యమంలో రాసినవారిలో 43.97శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్ల మాధ్యమంలో 4,22,743మంది పరీక్షలు రాయగా....అందులో 3,27,854మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మాధ్యమంలో 1,88,543మంది పరీక్ష రాయగా...82,984మంది ఉత్తీర్ణులయ్యారు. ఒడియా మాధ్యమంలో పరీక్ష రాసిన 903మందిలో 849మంది, తమిళ మాధ్యమంలో 301మంది పరీక్ష రాయగా...262మంది ఉత్తీర్ణులయ్యారు. కన్నడ, ఉర్దూ మాధ్యమాల్లో రాసినవారిలో 73.75శాతం, 70.12శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. హిందీ మాధ్యమంలో 11మంది పరీక్ష రాయగా 11మందీ ఉత్తీర్ణులయ్యారు.


ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైనవారే అధికం 

పదో తరగతి ఫలితాల ఉత్తీర్ణత శాతం తక్కువ ఉన్నా...పాస్‌ అయిన వారిలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైనవారే అత్యధికంగా ఉన్నారు. మొత్తం 4,14,281మందిలో 3,17,789మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ శ్రేణిలో 69,597మంది ఉత్తీర్ణులయ్యారు. ఽథర్డ్‌క్లాస్‌లో పాసైన వారు కేవలం 26,895మంది మాత్రమే. ఉమ్మడి జిల్లాలవారీగా ఉత్తీర్ణత శాతాలు...ప్రకాశం జిల్లా 78.30, శ్రీకాకుళం 78.22, విజయనగరం 77.50, చిత్తూరు 74.22, విశాఖపట్నం 73.11, కడప 71.03, గుంటూరు 68.20, నెల్లూరు 66.56, తూర్పుగోదావరి 65.83, కృష్ణా 65.21, కర్నూలు 58.20, పశ్చిమగోదావరి 57.55, అనంతపురం 49.70శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 


జూలై 6 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ

పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన వారికి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షను వచ్చేనెల ఆరోతేదీ నుంచి 15 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలకు మంగళవారం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 20వ తేదీవరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సాధారణ ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రూ.50 జరిమానాతో తాను రాసే పరీక్ష తేదీకి ఒక రోజు ముందువరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు ఈ తరగతులను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారి సర్టిఫికెట్లలో కూడా సాధారణ పరీక్షలో పాసైనట్లుగానే మార్కులు ఇస్తారు. సప్లిమెంటరీ అని పేర్కొనరు. అయితే ఇది జూలైలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలో పాసయ్యేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ఏడాది పాసయ్యేవారికి వర్తించదు. మరోవైపు రీకౌంటింగ్‌ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఫీజు కట్టి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి తన సమాధానపత్రం జిరాక్స్‌ కాపీ కోరుకుంటే కూడా ఇస్తారు. దీనికోసం సబ్జెక్టుకు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాలి. రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేస్తే అందులోనే రీకౌంటింగ్‌ ఉంటుంది కాబట్టి ఇక రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ దరఖాస్తులు బీఎ్‌సఈ.ఏపి.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. దరఖాస్తు చేసేవారి హాల్‌టికెట్‌పై మాత్రం సంబంధిత పాఠశాల హెడ్‌మాస్టరు సంతకం చేయాలి. 


తక్కువ రోజుల్లోనే ఫలితాలు...దానికే విభేదాలంటారా?

గత శనివారం నాడే ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి వాయిదా వేయడంపై మంత్రి బొత్స స్పందించారు. అధికారులు ఫలితాలు విడుదల చేయాలని తానే చెప్పానని...అయితే వారు మంత్రి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారన్నారు. ‘‘మనం కొత్తగా చేయొచ్చు...ఫలితాల విడుదల అధికారికంగా చేసే పనే కదా! రాజకీయ అవసరం ఉంటే అప్పుడు నేనొస్తా అని చెప్పా. అయితే దానికే ఉన్నతాధికారులకు-నాకు మధ్య విబేధాలున్నట్లు విమర్శలు చేసేశారు. అదేం లేదు. శనివారం సాంకేతిక సమస్యలతోనే వాయిదా పడింది. ఈరోజైనా ఎందుకొచ్చానంటే...రాకుంటే మళ్లీ ఏదో వైరుధ్యాలున్నాయంటారు. అందుకే వచ్చి విడుదల చేశాను’’ అని పేర్కొన్నారు. గతంలో పరీక్షలు రాసిన 30నుంచి 39రోజుల్లో ఫలితాలు ఇచ్చేవారని, తాము ఈసారి 28రోజుల్లోనే ఫలితాలు ఇచ్చేశామని తెలిపారు. మాల్‌ప్రాక్టిసింగ్‌ కేసుల్లో 80మంది ఉపాధ్యాయులు, వ్యక్తులపై కేసులు పెట్టామన్నారు. ఆఫ్‌ ది రికార్డుగా అందిన సమాచారం ప్రకారం..మాస్‌ కాపీయింగ్‌ అన్నది ఆర్గనైజ్డ్‌ నేరంగా జరుగుతోందని తెలిసిందని, దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడంపై ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత లేదన్నారు. 


11మార్కులొచ్చినా పాస్‌..

ఇద్దరు విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో 11 మార్కులొచ్చినా పాస్‌ అయినట్లు చూపించారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అయితే ఆ ఇద్దరు దివ్యాంగులు. దివ్యాంగుల్లో కొన్ని కేటగిరీల వారికి 10మార్కులు వస్తే పాస్‌ అయినట్లే. యాసిడ్‌ దాడికి గురైనవారు, మరుగుజ్జులు, సెరిబ్రల్‌పాఆల్సీ ఉన్నవారు, కుష్టువ్యాధి వచ్చి తగ్గినవారు... ఇలా కొన్ని కేటగిరీలవారికి 10మార్కులొస్తే పాసైనట్లేనని నిబంధనలు చెప్తున్నాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు.  

Updated Date - 2022-06-07T08:57:23+05:30 IST