జగన్‌ చెప్పినట్లే ‘జాబితా’!

ABN , First Publish Date - 2022-07-05T07:30:04+05:30 IST

భీమవరంలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమానికి... స్థానిక ఎంపీ హోదాలో రఘురామ కృష్ణరాజు అధ్యక్షత వహించాలి. కానీ... ప్రధాని కార్యాలయం (పీఎంవో) పంపిన ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరే లేదు! ‘అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మీ పార్టీ తరఫున ప్రతినిధిని పంపించండి’

జగన్‌ చెప్పినట్లే ‘జాబితా’!

గిట్టని వాళ్లు కనపడొద్దన్న సీఎం?

‘అంగీకరించిన’ కేంద్ర ప్రభుత్వం

ముఖ్యమంత్రికి ‘నచ్చని’ పేర్లు అవుట్‌

తొలి జాబితాలో రఘురామ, అచ్చెన్న

ఆ తర్వాత... ఆ పేర్లు మాయం

పవన్‌కు తొలుత అందని పిలుపు

తర్వాత పిలిచినా వెళ్లని జనసేనాని

జాబితాలో ఆఖరి నిమిషంలో మార్పులు

అంతా జగన్‌ కోరుకున్నట్లుగానే!

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మౌనముద్ర


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

భీమవరంలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమానికి... స్థానిక ఎంపీ హోదాలో రఘురామ కృష్ణరాజు అధ్యక్షత వహించాలి. కానీ... ప్రధాని కార్యాలయం (పీఎంవో) పంపిన ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరే లేదు! ‘అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మీ పార్టీ తరఫున ప్రతినిధిని పంపించండి’ అని కేంద్రం లిఖితపూర్వకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కోరింది. ఆయన సూచించిన మేరకు అచ్చెన్నాయుడుకు జాబితాలో చోటు దక్కింది.


కానీ... చివరి నిమిషంలో ఆ పేరు మాయమైంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు తొలుత ఆహ్వానమే అందలేదు. తర్వాత... కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మొక్కుబడిగా ఫోన్‌ చేసి పిలిచారు. కానీ... పవన్‌ భీమవరం వెళ్లలేదు. వెరసి... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి గిట్టని వారెవరికీ ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించలేదు. ‘వాళ్లను పిలవొద్దు’ అని జగన్‌ కోరారు! ‘తథాస్తు’ అంటూ బీజేపీ పెద్దలు అంగీకరించారు!  ప్రధాని మోదీ పర్యటనలో రాష్ట్రం నుంచి ఎవరెవరు పాల్గొనాలనే అంశంపై జగన్‌ ఒత్తిడికి కేంద్రం లొంగిపోయింది. తాను పిలిచిన అతిథులను కూడా ఆయన ఒత్తిడితో ఆహ్వానితుల జాబితా నుంచి తొలగించింది. ముందుగా నిర్ణయించిన అతిఽథులకు లిఖితపూర్వక ఆహ్వానాలు పంపి.. ఫోన్లు చేసి మరీ పిలిచిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ పరిణామంతో హతాశుడై మౌన ముద్ర వహించారు.


ఒక్కొక్కరుగా...: అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని కేంద్రం భావించింది. టీడీపీ వర్గాల కథనం ప్రకారం.. చంద్రబాబునే పిలవాలని మొదట అనుకున్నారు. కానీ ఆయన్ను పిలిస్తే తాను వచ్చేది లేదని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పడంతో టీడీపీ తరఫున ప్రతినిధిని పంపాలని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డి లిఖితపూర్వకంగా చంద్రబాబును కోరారు. ప్రధాని వస్తున్న కార్యక్రమం కావడంతో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. తొలుత పంపిన ‘ప్రొటోకాల్‌’ జాబితాలో అచ్చెన్న పేరు కూడా ఉంది. ఆ తర్వాత మాయమైపోయింది. అచ్చెన్నాయుడికి ఈ సమాచారం తెలియక భీమవరం వచ్చారు. జాబితాలో తన పేరు తీసేసిన సంగతి తెలుసుకుని... కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. తనకేమీ తెలియదని, కావాలంటే తన కార్లో కార్యక్రమానికి తీసుకెళతానని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. అధికారిక జాబితాలో నుంచి పేరు తీసివేసిన తర్వాత వస్తే బాగుండదంటూ అచ్చెన్న ఆగిపోయారు.


రఘురామ ఇలా...: వైసీపీ తరఫున గెలిచినా జగన్‌తో విభేదిస్తున్న స్థానిక నరసాపురం ఎంపీ రఘురామరాజుకు కూడా ప్రధాని సభకు ఆహ్వానం అందింది. ప్రొటోకాల్‌ ప్రకారం తన ప్రాంతంలో జరుగుతున్న ప్రధాని సభకు ఆయనే అధ్యక్షత వహించాల్సి ఉంది. అయితే... ఆదివారం రాత్రి ప్రధాని కార్యాలయం నుంచి ఇక్కడి అధికారులకు అందిన ‘సవరించిన’ జాబితాలో రఘురామ పేరు కూడా మాయమైంది. నిజానికి... ప్రధానితోపాటు వేదికపై ఉండే 9 మంది అతిథుల్లో రఘురామ, అచ్చెన్న పేర్లు కూడా ఉన్నాయని ఆదివారం వరకూ అధికార వర్గాలు నిర్ధారిస్తూ వచ్చాయి. తనకు గిట్టని వారు పాల్గొనడానికి వీల్లేదని ముఖ్యమంత్రి పట్టుబట్టడంతో బీజేపీ నాయకత్వం లొంగిపోయి వారి పేర్లు తీసివేసినట్లు చెబుతున్నారు. ఇది తెలియడంతోనే రఘురామరాజు ఆదివారం రాత్రి ప్రయాణిస్తున్న రైలు నుంచి దిగిపోయి హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లిపోయారు. 


విమర్శలు వచ్చాయనే పవన్‌కు ఫోన్‌!: బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విషయంలోనూ ఇంతే. అసలు ఆయనకు లిఖితపూర్వక ఆహ్వానమే అందలేదు. దీనిపై విమర్శలు రావడంతో ఒక రోజు ముందు కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసి రమ్మని పిలిచారు. అయితే తాను రాలేనని పవన్‌  స్పష్టం చేశారు. జగన్‌ ఒత్తిడితోనే ఆయన్ను కూడా ఆహ్వానితుల జాబితాలో చేర్చలేదని అంటున్నారు. విచిత్రంగా.. పవన్‌ సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవికి మాత్రం లిఖితపూర్వకంగా అధికారిక ఆహ్వానం అందింది. ఫోన్లో కూడా పిలిచారు. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రిగా పిలిచామని కిషన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు బీజేపీలోనే ఉన్నారు. ఆయనకూ ఆహ్వానం అందలేదు. అల్లూరి సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత, కేంద్ర  మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుకూ పిలుపు లేదు.


ఇంత నిస్సహాయతా..?

విగ్రహావిష్కరణ కార్యక్రమ నిర్వహణలో మోదీ సర్కారు వైఖరి విమర్శలపాలైంది. ఈ కార్యక్రమం తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా సీఎం పట్టుబడితే ఆహ్వానితుల పేర్లను తొలగించడం చర్చనీయాంశమైంది. ‘వైసీపీతో విభేదించిన రఘురామ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. పైగా స్థానిక ఎంపీ. ఆయన కూడా రాకూడదని అడ్డుపడినా బీజేపీ నాయకత్వం నిస్సహాయంగా ఉండిపోయింది. తాము పిలిచిన ప్రతిపక్ష నేతను ఆఖరి నిమిషంలో పక్కన పెట్టి నైతిక ధర్మాన్నీ విస్మరించింది. తమతో జట్టుకట్టిన పవన్‌ కల్యాణ్‌నూ పక్కనపెట్టి.. మిత్ర ధర్మానికి తిలోదకాలిచ్చింది. కేంద్రం ఇంత నిస్సహాయంగా వ్యవహరించడం మొదటిసారి చూస్తున్నాం’ అని ఒక సీనియర్‌ నాయకుడు వ్యాఖ్యానించారు.

Read more