అసెంబ్లీలో అబద్ధాలు దురదృష్టకరం

ABN , First Publish Date - 2022-09-19T10:06:08+05:30 IST

‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ సాక్షిగా, ఆత్మ సాక్షిని చంపుకుని సీఎం జగన్‌ చెప్పిన అబద్ధాలు దురదృష్టకరం. ఆర్థిక పరిస్థితి బాగుందని పదేపదే గొప్పలుచెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్క కేంద్రంపై నిందలు మోపే ప్రయత్నం

అసెంబ్లీలో అబద్ధాలు దురదృష్టకరం

ఇది తోలు మందం ప్రభుత్వం

అంకుశంతో పొడిచి నిద్రలేపే బాధ్యత బీజేపీది: సత్యకుమార్‌


రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 18: ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ సాక్షిగా, ఆత్మ సాక్షిని చంపుకుని సీఎం జగన్‌ చెప్పిన అబద్ధాలు దురదృష్టకరం. ఆర్థిక పరిస్థితి బాగుందని పదేపదే గొప్పలుచెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్క కేంద్రంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. జగన్‌ సీఎం ఆయ్యాక ఇప్పటి వరకూ రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. తలసరి ఆదాయం పెంచాల్సిన బాధ్యతను విస్మరించి తలసరి అప్పులు పెంచారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారు. ఇటువంటి పార్టీని, నాయకుడిని సీఎంగా ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మూడేళ్ల క్రితం అబద్ధాలే ఆలంబనగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌రెడ్డి ఇంకా అబద్ధాలనే కొనసాగిస్తున్నారు. 3రాజధానుల పేరుతో వికృత రాక్షసక్రీడకు శ్రీకారం చుట్టారు. అమరావతి విషయంలో అంతిమంగా ధర్మం, న్యాయం గెలుస్తుంది. రాష్ట్ర అప్పు రూ.7లక్షల కోట్లు ఉంటే... మీరు చెప్పినట్టే సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కి ఇచ్చింది రూ.లక్షా 61 వేల కోట్లే. మరి మిగిలిన డబ్బు ఎక్కడికి పోయింది? అమరావతి విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు.


ఈలోగా ప్రణాళికాబద్ధంగా కొంతమంది మంత్రులతో మాట్లాడించడం, ఇది ఉత్తరాంధ్రపై దండయాత్ర అని చెప్పడం, స్వయంగా అసెంబ్లీ సభాపతితో చెప్పించడం సంప్రదాయానికి విరుద్ధంగా, సభాపతి రాజకీయ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ప్రజల ఆక్రోశానికి ఒక గొంతుకలా మారి బీజేపీ ప్రజాపోరు పేరుతో 5వేల సభలు నిర్వహిస్తుంది. ఈ తోలుమందం ప్రభుత్వాన్ని అంకుశంతో పొడిచి నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది’’ అని సత్యకుమార్‌ పేర్కొన్నారు. 

Read more