ప్రయాణం నరకం

ABN , First Publish Date - 2022-11-08T00:44:12+05:30 IST

దేశంలోనే అతి పెద్ద టైగర్‌ రిజర్వు ఫారెస్టుగా పేరొందిన నల్లమల అటవీ ప్రాంతంలోని ఘాట్‌ రోడ్‌లలో ప్రయాణం నరకప్రాయంగా మారింది.

ప్రయాణం నరకం

జాతీయ హోదా వచ్చినా మారని నల్లమల ఘాట్‌రోడ్ల రూపు

విస్తరణకు నోచుకోని వైనం

ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలు

భయపెడుతున్న మలుపులు, లోయలు

అటవీ అనుమతుల సాకుతో పట్టించుకోని ప్రభుత్వం

వీటిపై ప్రయాణమంటేనే హడలిపోతున్న డ్రైవర్లు

దేశంలోనే అతి పెద్ద టైగర్‌ రిజర్వు ఫారెస్టుగా పేరొందిన నల్లమల అటవీ ప్రాంతంలోని ఘాట్‌ రోడ్‌లలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇరువైపులా ఒళ్లు గగుర్పొడిచే లోతైన లోయలు, ఎత్తైన కొండలు, పాములా మెలికలు, వంపులతో ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్లు, వాటి మార్జిన్లలో గుంతలతో వణుకుపుట్టిస్తోంది. దశాబ్దాలుగా ఘాట్‌ రోడ్ల దుస్థితి ఇలాగే ఉంది. ప్రకృతి సోయగాల నడుమ, అటవీ అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా సాగాల్సిన ఆ రోడ్ల నుంచి ప్రయాణం అంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. అవి అధ్వానంగా ఉండటం, రక్షణ గోడలు లేకపోవడంతోపాటు చిన్న సమస్య వచ్చినా గంటల తరబడి అడవి మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి వస్తుండటంతో వాహనచోదకులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

పెద్దదోర్నాల/గిద్దలూరు, నవంబరు 7: నల్లమల అడవి నుంచి జిల్లాలో ప్రధానంగా మూడు ఘాట్‌రోడ్లు వెళ్తుంటాయి. వీటిలో శ్రీశైలం-దోర్నాల, దోర్నాల-కర్నూలు, గిద్దలూరు-నంద్యాల ఘాట్‌రోడ్డులున్నాయి. అయితే ఇవి సింగిల్‌రోడ్లు కావడం, నిర్వహణ అధ్వానంగా ఉంటుండడంతో తరచూ వాహనచోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఇలా ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ గంటల తరబడి ఘాట్‌రోడ్లలో వాహనాలు నిలిచిపోతున్నాయి. అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, విస్తరణను చేపట్టాల్సిందిగా వాహనచోదకులు కోరుతున్నారు.

జాతీయ హోదా వచ్చినా..

శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డుకు ఉమ్మడి అంధ్రప్రదేశ్‌ సమయంలోనే జాతీయ రహదారి హోదా ఇచ్చారు. సున్నిపెంట నుంచి దోర్నాల మీదుగా కుంట (హనుమాన్‌ జంక్షన్‌)వరకు జాతీయ రహదారి 765నెంబరుతో గుర్తించారు. మరొకటైన కర్నూలు- గిద్దలూరు (కేజీ) రహదారిని రాష్ట్ర విభజనానంతరం 2018 జనవరి 18న ఎన్‌హెచ్‌ 340సీ పేరుతో గుర్తించింది. కానీ ఈ ఘాట్‌ రోడ్లలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో తరచూ ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. దీంతో గంటల కొద్దీ అటవీ ప్రాంతంలో చిక్కుకుని వాహనచోదకులు నానా అవస్థలు పడుతున్నారు. అటవీ అనుమతులు లేవంటూ ప్రభుత్వం అభివృద్ధిని దాటవేస్తోంది. కనీసం నిర్వహణకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

ఘాట్‌ రోడ్లలో పెరిగిన రద్దీ

రాష్ట్ర విభజనానంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని ఘాట్‌రోడ్లలో వాహనాల రద్దీ బాగా పెరిగింది. శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లే భక్తులు, అమరావతి రాజధానిగా ఏర్పడ్డాక రాయలసీమ జిల్లాల ప్రజలు విజయవాడ, విశాఖపట్టణం నగరాలకు వెళ్లడానికి ఈ ఘాట్‌ రోడ్లలోనే ప్రయాణిస్తున్నారు. అటు నుంచి వచ్చి పెద్దఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండటంతో ఈ రోడ్డులో కూడా భారీ వాహనాలతోపాటు బస్సులు, కార్లతో నిత్యం రద్దీగా ఉంటుంది.

విస్తరణకు నోచుకోని కర్నూలు-దోర్నాల ఘాట్‌ రోడ్డు

దోర్నాల-కర్నూలు రోడ్డులో మండలంలోని కొత్తూరు నుంచి ఆత్మకూరు మండలం వెంకటాపురం వరకు సింగిల్‌ లైన్‌గా ఉంది. పెద్ద మంతనాల నుంచి రోళ్లపెంట వరకు 30 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డు మరింత భయానకంగా ఉంటుంది. ఈ రోడ్లు ఇరుకుగా ఉండటంతో వాహనాలు మార్జిన్‌ దిగితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా గుంతలు పడ్డాయి. కొండ మీద కురిసిన వర్షపునీటికి కోతలు పడ్డాయి. కొన్నిచోట్ల కొండమీది నుంచి బండరాళ్లురోడ్డుకు అడ్డంగా పడుతుంటాయి. అంతేగాక మూలమలుపులు కూడా ఎక్కువే. ప్రమాద సూచికలు లేవు. ఈ రహదారిలో అధికంగా రోళ్ల పెంటకు సమీపంలో ప్రమాదకరమైన మలుపు ఉంది. ఇక్కడే ఎక్కువసార్లు ఇబ్బందులు కలుగుతాయి. చెంచుకుంట వద్ద కూడా పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

వాహనాలు నిలిచిపోతే యాతనే...

ఘాట్‌రోడ్డులో ఏప్రమాదం జరిగినా, వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోతాయి. దీంతో గంటలపాటు ప్రయాణికులు అటవీ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి. పైగా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా ఉండవు. దీంతో సమాచారం బయటికి వెళ్లే అవకాశం లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. సమస్యను పరిష్కరించేందుకు ఇటు దోర్నాలకు రావాలన్నా 40 కిలోమీటర్లు, అటు ఆత్మకూరుకు వెళ్లాలన్నా 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. గంటల తరబడి అడవి మధ్యలో నిలిచిపోవ డంతో తాగునీరు కూడా దొరక్క యా త్రికులు పడే అవస్థలు వర్ణణాతీతం. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో శ్రీశైలానికి భక్తులు దేశం నలుమూలల నుంచి పోటెత్తుతున్నారు. పైగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రభుత్వం ఏటా శివరాత్రి, ఉగాది వంటి పర్వదినాల్లో రోడ్డు మరమ్మతుల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడంతో నామమాత్రంగా పనులు చేసి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం, జాతీయరహదారి అఽథారిటీ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఘాట్‌ రోడ్లకు పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదాలకు నెలవుగా శ్రీశైలం ఘాట్‌రోడ్డు

శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డు కూడా ప్రమాదభరితంగా తయారైంది. ప్రధానంగా దోర్నాల నుంచి శిఖరం వరకు 40 కిలోమీటర్లు అనేక వంపులతో ఎత్తు పల్లాలతో ఉంది. ఇరువైపులా లోతైన లోయలు, ఎత్తైన కొండలు, వెంట వెంటనే మలుపుల నుంచిప్రయాణం వణుకు పుట్టిస్తోంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ప్రాణాలమీదికి తెచ్చుకున్నట్లే. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అక్కడక్కడా స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేశారు. కానీ అవి ఉన్నట్లు తెలిపే సూచికలు లేవు. దీంతో వేగంగా వచ్చి ఒక్కసారి బ్రేకులు వేసే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడ్డ ఘటనలు ఉన్నాయి. ఈ రహదారిలో ఎక్కువగా దెయ్యాల మలుపు వద్ద ప్రమాదాలు జరిగాయి. చింతల, తుమ్మలబైలుకు సమీపంలో కూడా ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జాతీయరహదారులుగా చేసినప్పటికీ అటవీ శాఖ ఆక్షేపణతో రోడ్ల విస్తరణ పనులు ఎన్‌హెచ్‌ఎస్‌ అధికారులు చేపట్టలేదు. దీంతో జాతీయ హోదా కేవలం ప్రకటనలకే పరిమితమైం దనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గిద్దలూరు ఘాట్‌లో టన్నెల్‌ స్పాట్‌..

గిద్దలూరు నుంచి నంద్యాలకు 60 కిలోమీటర్ల దూరం ఉండగా ఇందులో 30 కిలోమీటర్ల మేర నల్లమల అడవి ఉంది. ఈ అటవీ ప్రాంతం నుంచి ఘాట్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనంతపురం నుంచి గిద్దలూరు మీదుగా గుంటూరు వరకు రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కాగా సాంకేతిక కారణాలతో ప్రారంభం కాలేదు. దీంతో ఘాట్‌రోడ్డు అధ్వానంగా తయారై ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. రోడ్డుప్రమాదం జరిగిందంటే కనీసం 3 నుంచి 6 గంటలపాటు వాహన చోదకులు నట్టడవిలో నిలిచిపోతున్నారు. టన్నెల్‌ గోడల వద్ద, ఓవర్‌టేక్‌ చేసే సందర్భాల్లో మలుపుల వద్ద రోజురోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు గిద్దలూరు-నంద్యాల మధ్య ఘాట్‌రోడ్డు రెండు జిల్లాల పరిధిలో ఉంది. కొంతభాగం గిద్దలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో, మరికొంతభాగం మహానంది, సిరివెల్ల పోలీసు స్టేషన్ల పరిధిలో ఉంది. దీంతో ప్రమాదం జరిగిన సమాచారం తెలిసినప్పటికీ అది ఏ జిల్లా పరిధిలో ఉందో తెలుసుకునేందుకు సమయం పడుతోంది. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికి సాయం కూడా త్వరితగతిన అందడం లేదు. ప్రస్తుతం ఈ రోడ్డు జాతీయ రహదారిగా మారింది. అయిప్పటికీ ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు.

Updated Date - 2022-11-08T00:44:12+05:30 IST

Read more