ప్రియుడికి కాబోయే భార్యను ప్రియురాలే చంపేసింది

ABN , First Publish Date - 2022-10-08T10:11:08+05:30 IST

ప్రియుడికి కాబోయే భార్యను ప్రియురాలే చంపేసింది

ప్రియుడికి కాబోయే భార్యను ప్రియురాలే చంపేసింది

సహకరించిన ప్రియుడు.. ఏడాది క్రితం ఘటన  

మృతదేహం వెలికితీత, పోస్టుమార్టం

ప్రేమ జంటకు రిమాండ్‌.. యువతి అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ


చింతపల్లి, అక్టోబరు 7: యువతి అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడికి కాబోయే భార్యను ప్రియురాలే అంతమొందించింది. ఏడాది క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి చింతపల్లి ఏఎస్పీ కె.ప్రతా్‌పశివకిశోర్‌ శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాలివీ..  జి.మాడుగుల మండలం లువ్వసింగి పంచాయతీ చిట్టంపుట్టు గ్రామానికి చెందిన కోరాబు లక్ష్మి, చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ సంపంగిపుట్టుకు చెందిన వండలం గోపాల్‌ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం గోపాల్‌ తల్లిదండ్రులకు తెలియడంతో వారు మందలించి, గత ఏడాది ఆగస్టులో అదే గ్రామానికి చెందిన చెదల కాంతమ్మ(20)తో వివాహం చేసేందుకు నిర్ణయించారు. దాంతో గోపాల్‌ తనకు కాబోయే భార్య కాంతమ్మతో సన్నిహితంగా ఉండసాగాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి.. గోపాల్‌ను నిలదీసింది. ఇద్దరం కలిసి జీవించాలంటే కాంతమ్మను అంతమొందించాలని చెప్పి ఆ మేరకు వ్యూహరచన చేసింది. గత ఏడాది సెప్టెంబరు తొమ్మిదో తేదీన గోపాల్‌, లక్ష్మి కలిసి కాంతమ్మ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత తనను ఇంటి వద్ద దిగబెట్టాలని లక్ష్మి కోరింది. దీంతో ముగ్గురూ కలిసి సంపంగిపుట్టు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని చిట్టంపుట్టు వెళ్లారు. వినాయక చవితి కావడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు మండపంలో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్లారు. లక్ష్మి, కాంతమ్మ ఇంటి లోపలకు వెళ్లగా, గోపాల్‌ బయట ఉన్నాడు. కాంతమ్మ కూర్చోని ఉండగా లక్ష్మి గొడ్డలి తీసుకుని తల వెనుక భాగంలో బలంగా కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయి గట్టిగా కేకలు వేసింది. గోపాల్‌ వెంటనే లోపలకు వచ్చి కాంతమ్మ నోరు, ముక్కు గట్టిగా నొక్కి పెట్టాడు. ఇదే సమయంలో లక్ష్మి మరోమారు కాంతమ్మ తలపై గొడ్డలితో బలంగా కొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఇద్దరూ కలిసి కాంతమ్మ మృతదేహాన్ని రగ్గులో చుట్టి, సుమారు వందడుగుల దూరంలో ఒక గోతిలో పూడ్చివేశారు. కాంతమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఆచూకీ లభించకపోవడంతో లక్ష్మిని, గోపాల్‌ను ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలివ్వడంతో కాంతమ్మ తల్లి నారాయణమ్మ అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదుచేశారు. మూడు నెలల అనంతరం గోపాల్‌, లక్ష్మి కలిసి తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా) ఆలమూరు వెళ్లిపోయి అక్కడ సహజీవనం చేయసాగారు. ఈ నేపథ్యంలో.. కాంతమ్మ మిస్సింగ్‌ కేసు విచారణను వేగవంతం చేయాలన్న జిల్లా ఎస్పీ ఎస్‌.సతీశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు విచారణను మళ్లీ ప్రారంభించారు. చింతపల్లి ఏఎస్పీ పర్యవేక్షణలో అన్నవరం ఎస్‌ఐ సాయికుమార్‌ రంగంలోకి దిగి.. గోపాల్‌, లక్ష్మి ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడకు వెళ్లి కాంతమ్మ హత్య గురించి విచారించడంతో వారు నేరం ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో కాంతమ్మ మృతదేహాన్ని (అస్థిపంజరం) వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. గోపాల్‌, లక్ష్మిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read more