సేవా దురంధరుడు రత్తయ్య జాస్తి కన్నుమూత

ABN , First Publish Date - 2022-09-25T09:59:53+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాకు 68 ఏళ్ల క్రితం ఓడలో వెళ్లి తెలుగు ఉన్నతిని సమున్నత స్థాయికి చేర్చిన తెలుగు తేజం రత్తయ్య జాస్తి ఇకలేరు. 94ఏళ్ల వయసులో ఆయన న్యూమోనియాతో అమెరికాలోని

సేవా దురంధరుడు రత్తయ్య జాస్తి కన్నుమూత

పీహెచ్‌డీ అభ్యసించడానికి అమెరికాకు పయనం 

ఓడలో వెళ్లిన తొలి తొలితరం తెలుగు ప్రముఖుడు 


అమరావతి(ఆంధ్రజ్యోతి)/అమృతలూరు, సెప్టెంబరు 24: అగ్రరాజ్యం అమెరికాకు 68 ఏళ్ల క్రితం ఓడలో వెళ్లి తెలుగు ఉన్నతిని సమున్నత స్థాయికి చేర్చిన తెలుగు తేజం రత్తయ్య జాస్తి ఇకలేరు. 94ఏళ్ల వయసులో ఆయన న్యూమోనియాతో అమెరికాలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రత్తయ్య జాస్తి సతీమణి 20ఏళ్ల కిందటే కన్నుమూయగా ప్రస్తుతం ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. రెండురోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు కాలిఫోర్నియాలోని బే ఏరియా తెలుగు సంఘాల నాయకులు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బోడపాడు గ్రామానికి చెందిన రత్తయ్య జాస్తి 1928లో జన్మించారు. మద్రాసు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌ చేసిన ఆయన బెంగళూరులోని ఐఐఎ్‌ససీలో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని మిన్నెసోటా యూనివర్శిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. కాలిఫోర్నియాలోని లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థలో ఇంజనీర్‌గా ఉన్నత స్థాయిలో సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. 1954లో అమెరికాకు ఓడలో ప్రయాణించి వెళ్లిన తొలితరం తెలుగు ప్రముఖుడు ఆయనే. అప్పట్లో అమెరికాకు వెళ్లేందుకు సుమారు 38 రోజుల పాటు ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చేది. 


తెలుగంటే ప్రాణం...

తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని, తెలుగువారంతా ఐక్యంగా ఉండాలని రత్తయ్య జాస్తి తపించారు. వైద్యరంగానికి ఇతోధికంగా సాయం అందించారు. మూడోకంటికి తెలియకుండా అనేక గుప్తదానాలు చేశారు. అప్పట్లోనే ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి దాదాపు కోటి రూపాయల వరకు ఆర్థికసాయం అందించారు. ఆసుపత్రిలో ఒక బ్లాక్‌ను సైతం నిర్మించి రోగులకు సాయపడాలనే ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. 


జయరాం కోమటి సంతాపం 

అమెరికాలో తెలుగు తేజం, సేవా దురంధరుడు రత్తయ్య జాస్తి మృతిపట్ల ఎన్నారై టీడీపీ యూఎ్‌సఏ అధ్యక్షుడు, బే ఏరియా కమ్యూనిటీ నాయకుడు జయరామ్‌ కోమటి ప్రగాడ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. బే ఏరియా కమ్యూనిటీతో పాటు, తెలుగు సంఘాలు, బాటా, తానా కార్యవర్గాలు ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశాయి.

Read more